ఉత్తరాంధ్ర : విజయసాయి ఇప్పుడే రాజీనామా చేయచ్చుకదా ?

Vijaya


‘విశాఖపట్నంకు రైల్వేజోన్ రాకపోతే  రాజీనామా చేస్తాను’ ఇది తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలుగురాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ సాధ్యం కాదని రైల్వోబోర్డు ఉన్నతాధికారులు చెప్పారని మీడియాలో వచ్చింది. దీనిపై సాయిరెడ్డి స్పందించారు.తెలుగురాష్ట్రాల భేటీలో అసలు రైల్వేజోన్ అంశం చర్చకే రాలేదన్నారు. మీడియా కావాలనే ప్రభుత్వంపై బురదచల్లేందుకు అలాంటి వార్తలు ఇచ్చినట్లు ఎంపీ మండిపడ్డారు. ఎలాగైనా విశాఖకు రైల్వేజోన్ వచ్చి తీరుతుందని నమ్మకంగా చెప్పారు. ఒకవేళ రైల్వేజోన్ రాకపోతే రాజీనామా చేస్తానని కూడా చాలెంజ్ చేశారు. ఇక్కడ సాయిరెడ్డి గుర్తుంచుకోవాల్సిందేమంటే రైల్వేజోన్ మంజూరు చేసినట్లు ప్రకటించిన కేంద్రమే రైల్వేజోన్ వయబుల్ కాదని కూడా చెప్పింది.కాకపోతే పార్లమెంటులో ఏమో మంజూరు చేస్తున్నట్లు ప్రకటనచేసి వయబుల్ కాదని రైల్వేబోర్డుతో చెప్పించింది. ఈ విషయంపై క్లారిటి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతు రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడుందని చెప్పారు. జోన్ రద్దయిందనే వార్తలను నమ్మద్దన్నారు. కానీ ఎప్పుడు ఏర్పాటవుతుందనేది మాత్రం చెప్పటంలేదు. ఈ విషయంలోనే కేంద్రాన్ని జనాలెవరు నమ్మటంలేదు. సరే ఈ విషయం గురించి పక్కనపెట్టేస్తే రైల్వేజోన్ రాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన విజయసాయి మరి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో ఎందుకని రాజీనామా చేస్తానని చెప్పలేదు. విశాఖకు రైల్వేజోన్ ఎంత అవసరమో విశాఖ స్టీల్  ప్రైవేటుపరం కాకుండా అపటమూ అంతే ప్రిస్టేజి కదా.రైల్వేజోన్ రాకపోతే చేస్తానని ప్రకటించిన రాజీనామాను విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చేసేయచ్చు కదా. అప్పుడైనా సాయిరెడ్డి చిత్తశుద్ది, నరేంద్రమోడీ ప్రభుత్వం చెత్తశుద్ది జనాలకు అర్ధమవుతుంది. అప్పుడెప్పుడో ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు కదా. ఇపుడు అలాంటి రాజీనామాలే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపేందుకు కూడా చేయచ్చు కదా ఎవరైనా వద్దంటారా ? సాయిరెడ్డి రాజీనామా చేస్తే ఒకేసారి బీజేపీ, టీడీపీ ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఏమంటారు సాయిరెడ్డి గారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: