కోస్తా : ఈ జిల్లాలో టీడీపీ టార్గెట్ రీచవుతుందా ?
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టార్గెట్ రీచవ్వటానికి చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. గడచిన రెండు ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ చాలా ఇబ్బందులు పెడుతోంది. జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ సీట్లుంటే 2014 ఎన్నికల్లో టీడీపీ మూడు అసెంబ్లీలు మాత్రమే గెలుచుకుంది. తర్వాత చంద్రబాబునాయుడు ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు వైసీపీ ఎంఎల్ఏలను లాక్కున్నారు. అలాగే నెల్లూరు ఎంపీ సీటులో వైసీపీయే గెలిచింది.
ఇక 2019 ఎన్నికల్లో అయితే తెలుగుదేశంపార్టీ అసలు బోణీయే కొట్టలేదు. మొత్తం 10 సీట్లకు 10 సీట్లూ వైసీపీయే గెలుచుకుంది. అలాగే పార్లమెంటుసీటును కూడా రెండోసారి వైసీపీయే గెలుచుకుంది. తర్వాత జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో జిల్లాను దాదాపు వైసీపీయే స్వీప్ చేసేసింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ కనీసం ఒక్కటంటే ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు.
ఇపుడు సమస్య ఏమిటంటే నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కనీసం ఐదు సీట్లలో అయినా గెలవాలన్నది చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు టార్గెట్ రీచయ్యేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే జిల్లావ్యాప్తంగా తమ్ముళ్ళలో ఆధిపత్యపోరు విపరీతంగా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలోను టికెట్ కోసం కనీసం ఇద్దరు ముగ్గురు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు పోటీపడుతున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది.
నిజానికి చాలామంది నేతలు పార్టీలో యాక్టివ్ గా లేరు. 2014-19 మధ్య తమ నియోజకవర్గాల్లో, మంత్రులుగా జిల్లాలో చక్రంతిప్పిన వారిలో చాలామంది అసలు పార్టీలో కనబడటమే లేదు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని చంద్రబాబు ఎంతగా పిలుపిస్తున్నా జిల్లాలోని నేతల్లో చాలామంది స్పందించటంలేదు. ఈ నేపధ్యంలోనే ఈనెల 14-17 మధ్య జిల్లా పర్యటన పెట్టుకున్నారు. నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేటలో రోడ్డుషోలు కూడా పెట్టుకున్నారు. మరి చంద్రబాబుపర్యటన ఏ మేరకు విజయవంతమవుతుందో చూడాల్సిందే. మాజీ ఎంఎల్ఏల్లో కొందరు వైసీపీలోకి మరికొందరు బీజేపీలోకి వెళిపోయారు. కాబట్టి చంద్రబాబు టార్గెట్ రీచయ్యే విషయం సస్పెన్సుగా మారిపోయింది.