హైదరాబాద్ : కేసీయార్ అసలు సమస్యేంటో తెలుసా ?

Vijaya






జాతీయ రాజకీయాల్లో బ్రహ్మాండంగా వెలిగిపోవాలని కేసీయార్ చాలా తాపత్రయపడుతున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా తనవల్ల కావటంలేదు. కారణం ఏమిటంటే మూడు కారణాలు కనబడుతున్నాయి. అవేమిటంటే మొదటిది కాంగ్రెస్ తో కలిసి పనిచేయకూడదని డిసైడ్ చేసుకోవటం. రెండోది జాతీయస్ధాయి నేతల్లో చాలామందితో సరైన సంబంధాలు లేకపోవటం. మూడోది ఏమాత్రం విశ్వసనీయత లేకపోవటం. ఈ మూడు కారణాలతోనే కేసీయార్ సక్సెస్ కొట్టలేకపోతున్నారు.



ఇపుడిదంతా ఎందుకంటే వినాయకచవితి పండుగ రోజు అంటే బుధవారం బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ అవబోతున్నారు. అప్పుడెప్పుడో గల్వాన్ లోయలో మన సైన్యానికి పాకిస్ధాన్ సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు కొందరు చనిపోయారు. అలా చనిపోయినవారిలో బీహార్ రెజిమెంటు సైనికులకు ఆర్ధికసాయం అందించబోతున్నారు. నిజానికి గల్వాన్ లోయలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఆర్ధికసాయం అందించటం కేసీయార్ పనికాదు. ఆ బాధ్యత కేంద్రం+ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది మాత్రమే.



అయినా జాతీయ రాజకీయాల్లో వెలిగిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి లేనిబాధ్యతను కేసీయార్ నెత్తినేసుకున్నారు. నిజానికి నితీష్ భేటీకి ఇదిపైకి కనిపించే కారణం మాత్రమే. అసలు కారణం మాత్రం నరేంద్రమోడీ వ్యతిరేక రాజకీయాలకు ఊపుతేవటమే. ఈమధ్యనే ఎన్డీయేలో నుండి నితీష్ బయటకు వచ్చేశారు కాబట్టి కేసీయార్ వెళ్ళి కలుస్తున్నారంతే. ఇక్కడ కేసీయార్ గమనించాల్సిందేమంటే బీహార్లో ఉన్నది  సంకీర్ణప్రభుత్వం. జేడీయూ+ఆర్జేడీ+కాంగ్రెస్ పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి.




కేసీయార్ తో చేతులు కలపాలంటే నితీష్ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునేందుకు లేదు. ముందుగా భాగస్వాములతో చర్చించిన తర్వాతకానీ  ఏ నిర్ణయమూ తీసుకోలేరు. ఒకవైపు కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తునే మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటైన సంకీర్ణప్రభుత్వం సారధి నితీష్ తో భేటీ అయితే వచ్చే ఉపయోగమేమీ ఉండదు. కాకపోతే నితీష్ ఇంట్లో వినాయకచవితి భోజనం చేసిన తృప్తితప్ప కేసీయార్ కు ఇంక దక్కేదేమీ ఉండదు.  ముందు తన పద్దతి మార్చుకుంటే కానీ జాతీయ రాజకీయాల్లో స్ధానం సంపాదించుకోవటం కష్టం. తెలంగాణాలో నడిపించినట్లే నడిపిద్దామంటే జాతీయ రాజకీయాల్లో తనను ఎవ్వరు పట్టించుకోరని కేసీయార్ గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: