అమరావతి : జనసేనలో అతిపెద్ద సమస్యేంటో చెప్పిన పవన్
పోయిన ఎన్నికల్లో జనసేన ఓటమికి కారణాలు ఏమిటో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇపుడు బయటపెట్టారు. ఇంతకీ ఆయన చెప్పిన కారణం ఏమిటంటే కోవర్టులేనట. కొంతమంది నేతలు పక్కనే ఉండి పొడిచేయటం వల్లే పార్టీ ఓడిపోయిందన్నారు. అందుకనే వెన్నుపోటుదారులకు ఒక హెచ్చరిక కూడా చేశారు. వెన్నుపోటు పొడిచే ఆలోచనలో ఉన్న నేతలందరినీ దయచేసి వాళ్ళకిష్టమైన పార్టీల్లోకి వెళ్ళిపొమ్మన్నారు.
అంటే రెండుపార్టీల్లోను కోవర్టులున్నారన్న విషయం అధినేతలే చెబుతున్నారు. నిజానికి కోవర్టుల వ్యవస్ధను తయారుచేసిందే చంద్రబాబు. ఇతర పార్టీల్లోకి తన మనుషులనే పంపించటం అక్కడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండటం చంద్రబాబుకే అలవాటని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను వైసీపీ నేతలు ఉదాహరణగా చెబుతుంటారు. ఇంతకాలం చంద్రబాబు చెప్పినదాన్నే ఇపుడు పవన్ కూడా మొదలుపెట్టారు. అయినా టీడీపీలో కోవర్టులున్నారంటే ఏదోలే అనుకోవచ్చు. మరి జనసేనలో కూడా కోవర్టులున్నారంటే ఆశ్చర్యంగా ఉంది.
జనసేనలో కోవర్టులుంటే వాళ్ళు ఏ పార్టీకి పనిచేయాలి ? జగన్మోహన్ రెడ్డేమో జనసేను ఒక రాజకీయపార్టీగాను, పవన్ను నేతగానే గుర్తించటంలేదు. అలాంటిది జనసేనలోకి తన మనుషులను కోవర్టులుగా పంపాల్సిన అవసరం ఏముంటుంది ? టీడీపీ నుండో లేకపోతే మిత్రపక్షం బీజేపీ నుండో ఎవరైనా కోవర్టులుగా ఉండాలంతే. ఈ రెండుపార్టీలకు కూడా అంత అవసరం ఏముంటుందో అర్ధంకావటంలేదు. అయినా పవన్ కు తనపార్టీలో కోవర్టులున్నారనే అనుమానం ఎందుకొచ్చింది ? కోవర్టులున్నారంటేనే వాళ్ళెవరో కూడా ఈపాటికే గుర్తించుంటారు కదా. మరి అలాంటి వాళ్ళంతా పార్టీనుండి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేబదులు తానే పంపేయచ్చు కదా.