రామకృష్ణ దెబ్బకు యాంకర్ నోరుపడిపోయిందా ?
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి టీడీపీ, జనసేన, సీపీఐ ఏ స్ధాయిలో టార్గెట్ చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా జగన్ పై బురద చల్లేయటంలో పోటీపడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జగన్ విషయంలో అదికూడా ఎల్లోమీడియా ఛానల్లో రామకృష్ణ తాజాగా భిన్న వైఖరి అవలంబించటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ వైఖరి చంద్రబాబు, పవన్ కు షాకిచ్చేవే అనటంలో సందేహంలేదు.
ఇంతకీ రామకృష్ణ ఏమంటారంటే ఏపార్టీ అయినా అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోను పక్కన పడేస్తాయట. అయితే జగన్ను అభినందించాల్సిందే అన్నారు. ఎందుకంటే మ్యానిఫెస్టోలో చెప్పిన సంక్షేమపథకాల అమలుకు ప్రయత్నిస్తున్నారట. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జగన్ మాట్లాడుతు పథకాల్లో భాగంగా తమ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రు. 81 వేల కోట్లను వేసినట్లు చెబితే ఏ ఒక్కరు కూడా తప్పు పట్టలేదన్నారు. అంటే దీన్ని బట్టి జగన్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో 81 వేల కోట్ల రూపాయలు వేసింది నిజమనే అనుకోవాలని రామకృష్ణ కన్ఫర్మ్ చేశారు.
ప్రస్తుత పరిస్ధితుల్లో రాష్ట్రప్రభుత్వం మహిళ అభివృద్ధికోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయటం చాలా పెద్ద విషయమని రామకృష్ణ సీఎంకు కితాబిచ్చారు. కరోనా కష్టకాలంలో కూడా జగన్ 32 లక్షల మందికి ఇళ్ళస్ధలాలిచ్చినట్లు రామకృష్ణ అంగీకరించారు. గతంలోని ప్రభుత్వాలు కూడా ఇళ్ళస్ధలాలిచ్చినా ఒకేసారి 32 లక్షలమందికి ఇళ్ళస్ధలాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. అనేక కారణాల వల్ల పేదప్రజల మనసుల్లో జగన్ కు ఓట్లేయాలనే భావన బలంగా నాటుకుపోయిందన్న విషయాన్ని రామకృష్ణ స్పష్టంగా చెప్పారు.
మనం జగన్ను నెగిటివ్ గా చూస్తున్నాం కాబట్టి జనాల్లో కూడా నెగిటివ్ గా ఉందనుకోవటం సరికాదన్నారు. అలాగే జగన్ తనకంటు పాజిటివ్ ఓట్ బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలని అనుకుని అదే పద్దతిలో ఓటుబ్యాంకు ఏర్పాటు చేసుకుంటున్నట్లు కుండబద్దలు కొట్టారు. కొసమెరుపేమిటంటే రామకృష్ణ ఇదంతా చెబుతున్నపుడు ఎల్లోమీడియా ఛానల్ యాంకర్ మొహం మాడిపోవటమే కాకుండా నోట మాటపడిపోయింది.