అమరావతి : బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్టయ్యిందా ?
తాజగా పార్లమెంటు కేంద్రంగా జరిగిన పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్టయినట్లే అనుమానంగా ఉంది. ఇంతకీ ఏ విషయంలో బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్టయ్యిందంటే కాపుల రిజన్వేషన్ అంశంలో. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లను తమ ఖాతాలో వేయించుకోవాలని బీజేపీ నేతలు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు పదే పదే కాపుల రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారు.
రాష్ట్రజనాభాలో కాపులు సుమారు 20 శాతంకు పైగా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో మెజారిటి సెక్షన్లు వైసీపీ-టీడీపీ మధ్య చీలిపోయున్నాయి. మధ్యలో జనసేనకు ఎంతమంది మద్దతిస్తునారో సరైన లెక్కలులేవు. ప్రస్తుతానికి మిత్రపక్షంగా జనసేన రేపటి ఎన్నికల సమాయానికి తమతోనే ఉంటుందనే నమ్మకం బీజేపీ నేతలకు ఉన్నట్లు లేదు. పవన్ వైఖరి కూడా దానికి తగ్గట్లే అనుమానంగా ఉంది. అందుకనే కాపుల ఓట్లు తమ ఖాతాలో పడేట్లుగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
కమలనాదుల గేమ్ ప్లానులో భాగంగానే కాపులను ఓబీసీల్లో చేర్చటానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ పార్లమెంటులో ప్రకటించారు. ఇక్కడే బీజేపీ గేమ్ ప్లాన్ మొదలవ్వబోతోంది. మొదటిదేమో ఓబీసీలకు గతంలో కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించాలనే డిమాండ్ చేయబోతోంది. ఇక రెండోదేమంటే తాము అధికారంలోకి వస్తే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం.
అంటే ఒక డిమాండ్, మరో హామీతో కాపుల ప్రయోజనాలను రక్షించేందుకు తాము మాత్రమే ఆలోచిస్తామనే సంకేతాలను కాపుల్లోకి పంపటానికి బీజేపీ రెడీ అవుతోంది. వీళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుందనే సంకేతాలు ఏమాత్రం కనబడినా బీజేపీని వదిలిపెట్టే విషయంలో పవన్ వెనకాడుతాడు. బీజేపీ ప్లాన్ లో ఇది కూడా అంతర్లీనంగా ఉంది. కాబట్టే కాపులకు రిజర్వేషన్ అంశంలో బీజేపీ ఇంత జాగ్రత్తగా పావులు కదుపుతోంది. అంతా బాగానే ఉంది కానీ తనకు ఏమాత్రం నష్టంలేదని అనుకుంటే ఆ రిజర్వేషన్ ఏదో జగన్మోహన్ రెడ్డే కల్పించకుండా ఉంటారా ?