అమరావతి : తగ్గేదేలే..తేల్చి చెప్పేసిన జగన్

Vijaya


మూడు రాజధానుల ఏర్పాటు నుండి తగ్గేదేలే అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తేల్చిచెప్పారు. రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్ధకే ఉందని స్పషంగా ప్రకటించారు. అసెంబ్లీలో మూడు రాజధానులు, ఈమధ్యనే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో జగన్ మాట్లాడుతు ఏ విషయంలో అయినా సరే అసెంబ్లీలో చట్టాలు చేయటం తమ హక్కన్నారు.





పరిపాలనా వికేంద్రీకరణపై చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని హైకోర్టు చెప్పటాన్ని జగన్ తప్పుపట్టారు. రాజధానులపై కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిందే అని హైకోర్టు చెప్పటాన్ని జగన్ కొట్టేశారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశమే అని దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం మూడుసార్లు అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. జగన్ తాజా వైఖరి చూస్తుంటే రాజధానుల ఏర్పాటుపై కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్లే ఉంది.





ఇదే సమయంలో హైకోర్టు ఎక్కడుంటే అక్కడే రాజధాని ఉంటుందని హైకోర్టు చేసిన వ్యాఖ్యను కేంద్రం తప్పుపట్టిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు.  నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధానిని నిర్మించాలని హైకోర్టు ఎలా డిక్టేట్ చేస్తుందంటు జగన్ మండిపోయారు. వ్యవస్ధలు వాటి పరిధిలో అవి ఉండకపోతే  మొత్తం సిస్టమే కుప్పకూలిపోతుందని జగన్ గట్టిగానే చెప్పారు. శాసనవ్యవస్ధ ఏమి చట్టం చేయలి ? ఏది చేయకూడదని చెప్పేహక్కు కోర్టుకు లేదని జగన్ తేల్చిచెప్పారు.





హైకోర్టు ఆచరణ సాధ్యంకాని తీర్పిచ్చినట్లు జగన్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో స్పీచ్ విన్న తర్వాత రాజధాని అమరావతిపై కోర్టు తీర్పును జగన్ ఏమాత్రం ఖాతరు చేయటంలేదన్న విషయం స్పష్టమైపోయింది. పైగా అధికార, శాసనవ్యవస్ధల పరిధిలోకి న్యాయవ్యవస్ధ జొరబడుతోందన్న అభిప్రాయంతోనే జగన్ ఉన్నారు. అందుకనే వ్యవస్ధలు వేది పరిధిలో అవి పనిచేయాలని చెప్పింది. మొత్తంమీద జగన్ తన సమాధానంతో మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడుందన్న విషయాన్ని చెప్పేశారు. మరి జగన్ తాజా వ్యాఖ్యలపై హైకోర్టు ఏ విధంగా రియాక్టవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: