అమరావతి : భీమ్లా దెబ్బకు వైసీపీ ఖాళీ అయిపోతుందా ?
వైసీపీ నేతలు, కార్యకర్తలంతా పార్టీని వదిలిపెట్టేసి వచ్చి జనసేనలో చేరాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బంపరాఫర్ ఇచ్చారు. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సినిమా థియేటర్ల దగ్గర కర్ఫ్యూ వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు నాదెండ్ల మండిపడ్డారు. అంటే సినిమా ఫెయిలవ్వాలన్న ఉద్దేశ్యంతోనే థియేటర్ల దగ్గర జగన్ ప్రభుత్వం భయోత్పాత వాతావరణం కల్పించినట్లు ఆరోపించారు.
సినిమా లైనునే జగన్-పవన్ కల్యాణ్ కు నాదెండ్ల ఆపాదించటం మరీ విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పవన్ కల్యాణ్ ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరిగిందని చెప్పటమే విడ్డూరం. జగన్ అధికార పూరితమైన అహంకారాన్ని జనాలంతా ప్రత్యక్షంగా చూశారట. నియంత ఆలోచనలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ పాలన ఎంతో కాలం సాగదని కూడా జోస్యం చెప్పేశారు. జనసేన పెట్టి ఇంత కాలమైనా రెండో నేతను ఎదగనీయకుండా చేసిన పవన్ నియంతా ? లేకపోతే వందలాది మందికి పదవులను అందించిన జగన్ నియంతో జనాలకు తెలీకుండానే ఉంటుందా ?
అందుకనే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండే వైసీపీ నేతలు, కార్యకర్తలు, క్షేత్రస్ధాయిలో పనిచేసేవారంతా వైసీపీని వదిలిపెట్టేయాలని నాదెండ్ల చెప్పారు. వారంతా వచ్చి జనసేనలో చేరి పవన్ కల్యాణ్ నాయకత్వంలో పనిచేయాలని పిలుపిచ్చారు. రెవిన్యు అధికారులందరినీ థియేటర్ల దగ్గర కాపలా ఉంచటంలో ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటంటు నాదెండ్ల నిలదీయటమే ఆశ్చర్యంగా ఉంది.
వచ్చేయండి వైసీపీని వదిలేసి వచ్చి జనసేనలో చేరాల్సిన సమయం వచ్చేసిందంటు నాదెండ్ల అందరినీ ఆహ్వానించారు. అదేదో సినిమాలో ‘భలే మంచి చౌకభేరము’ అనే పాట ఉన్నట్లు వైసీపీని వదిలేసి జనసేనలో చేరటానికి ఇదే మంచి సమయమని నాదెండ్ల చెప్పారు. మరి నాదెండ్ల పిలుపుకు ఎంతమంది వైసీపీ నేతలు స్పందించి జనసేనలో చేరుతారో చూడాలి. ఇంకో విచిత్రమేమిటంటే నాదెండ్ల సినిమాను రాజకీయాలను కలిపేయటం. భీమ్లానాయక్ సినిమా విడుదలను నాదెండ్ల ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అంటే సినిమా విడుదల, జనసేన రాజకీయ కార్యక్రమం ఒకటే అని నాదెండ్ల స్పష్టంగా చెప్పేశారు.