థియేటర్ల పై దాడులు చేసి ఆ మధ్య కాలర్ ఎగరేసిన వైసీపీ సర్కారు ఇది ఒక ఝలక్. హైకోర్టులో నాటి చర్యలపై దాఖలైన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.ఇందుకు సంబంధించి వెలువడిన తుది తీర్పులో కోర్టు బాధితుల పక్షమే నిలిచి, యథావిధిగా జగన్ సర్కారు నిర్ణయాలు,యంత్రాంగం వాటిని అమలు చేస్తున్న తీరు తెన్నులపై మండి పడింది.ఆ విధంగా అధికారులకు కోర్టు వాకిట ఎదురు దెబ్బ తగిలింది.
జగన్ ప్రభుత్వం గత కొంత కాలంగా అనాలోచిత నిర్ణయాలు చేస్తూనే ఉంది. నిబంధనల పేరిట థియేటర్లను మూసి వేయించాలన్న ఆలోచన కూడా ఓ విధంగా అనాలోచితమే! ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తగిన కాల పరిమితి ఇచ్చి సంబంధిత నియమ నిబంధనలు పాటించేందుకు అవకాశం ఇవ్వకుండా ఆ మధ్య వరుస థియేటర్లపై దాడులు చేయించారు.దీంతో కొందరు దిగాలు చెందగా ఇంకొందరు న్యాయ పోరాటం సాగించారు. ఈ నేపథ్యంలో ఇవాళ థియేటర్లకు సంబంధించి ఓ విషయమై హై కోర్టులో జగన్ ప్రభుత్వానికి అక్షతలు పడ్డాయి. నిబంధనలను అనుసరించే థియేటర్లు సీజ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ, సంబంధిత అధికార వర్గాలపై మండి పడింది. ఆ వివరం ఈ కథనంలో...
ఇవాళ హైకోర్టులో థియేటర్ల వ్యవహారం పై దాఖలయిన పిటిషన్ విచారణకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం శ్రీనివాస మహల్ థియేటర్ యాజమాన్యం తమ థియేటర్ ను తహశీల్దార్ సీజ్ చేయడంపై కోర్టును ఆశ్రయించారు. తహశీల్దార్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ థియేటర్ యజమాని శంకర్రావు ప్రభుత్వ అధికారుల నిర్ణయంపై న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యాడు.విచారణ సందర్భంగా దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. అసలు థియేటర్లను సీజ్ చేసే అధికారం తహశీల్దార్ కు లేదని తేల్చింది. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాలు మేరకు తహశీల్దార్ థియేటర్ ను సీజ్ చేశారన్న ప్రభుత్వం తరఫు వాదనను కోర్టు తోసి పుచ్చింది. లైసెన్స్ జారీ చేసిన సబ్ కలెక్టరుకే ఆ అధికారం ఉంటుందని, తహశీల్దార్ అటువంటి అధికారాలు ఏవీ దఖలు పడలేదని పేర్కొంటూ పిటిషనర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.అదేవిధంగా లైసెన్స్ రెన్యువల్ చేసే విషయమై అధికారుల దగ్గర పరిశీలనలో ఉంది కనుక సినిమాలను ప్రదర్శించుకోవచ్చని కూడా చెప్పి పిటిషనర్ కు ఊరట ఇచ్చింది.దీంతో పిటిషనర్ ఆనందం వ్యక్తం చేశారు.