పంజాబ్ : కాంగ్రెస్ కు సినిమా ఇప్పుడే మొదలైందా ?
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మొదలవుతుంది అసలైన సినిమా. ఎందుకంటే పంజాబ్ లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్ధిగా చరణ్ జీత్ సింగ్ చన్నీని పార్టీ ప్రకటించింది కాబట్టి. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పంజాబ్ కు వచ్చారు. లూధియానాలో జరిగిన ర్యాలీ సందర్భంగా రాహుల్ ఈ ప్రకటన చేశారు. మెజారిటి నేతలు, కార్యకర్తలు మొదటినుండి చన్నీవైపే మొగ్గు చూపుతున్నారు.
కాకపోతే పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకి భయపడే ఇన్నిరోజులు ప్రకటించలేదు. తననే సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని సిద్ధూ బలంగా కోరుకుంటున్నారు. అయితే అధిష్టానం ఆలోచనలలో మాత్రం చన్నీయే ఉన్నారు. చన్నీ సీఎం కుర్చీలో కూర్చుని కొద్ది నెలలే అయినా మంచిపేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పంజాబ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.మొదటిసారి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
రాష్ట్రంలో 31 శాతంమంది దళితులున్నారు కాబట్టే అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి చన్నీనే సీఎంను చేసింది. చన్నీ స్ధానంలో తానే సీఎం అవుదామని సిద్ధూ చాలా ప్రయత్నాలు చేసినా సాధ్యంకాలేదు. ఆ కోపంతోనే చన్నీని బాగా రాచిరంపాన పెడుతున్నాడు. సీఎం అభ్యర్ధిని ప్రకటించాల్సిందే అంటు సిద్ధూ పదే పదే అధిష్టానాన్ని ఒత్తిడిపెట్టడంలో హిడెన్ అజెండా ఉంది. కాకపోతే ఎవరిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించినా తాను సంతోషంగా సహకరిస్తానని పైకి చెబుతున్నాడంతే.
ఇపుడు సిద్ధూ బద్ధ విరోధిగా పరిగణిస్తున్న చన్నీనే అధిష్టానం సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది. దాంతో లోలోపల సిద్ధూ మండిపోతుంటాడనటంలో సందేహంలేదు. తాజా ప్రకటన తర్వాత సిద్ధూ వైఖరి ఎలాగుంటుందో అనే టెన్షన్ పార్టీలో పెరిగిపోతోంది. 117 స్ధానాలకు రేపు 20వ తేదీన ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈలోపు సిద్ధు ఏమి కంపుచేస్తారో చెప్పలేకున్నారు. మొత్తానికి ఈ రెండువారాల్లో కాంగ్రెస్ కు సిద్ధు సినిమా చూపటం ఖాయమనే అంటున్నారు. మరి ఎలాంటి సినిమా చూపుతాడో చూడాల్సిందే.