రాయలసీమ : జగన్ ముందు చంద్రబాబు చేతులెత్తేశారా ?
మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజేమో ఒక కార్యకర్త చంద్రబాబును ఉద్దేశించి ‘రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవచ్చు కదా’ అని అడిగాడు. దానికి చంద్రబాబు సమాధానంగా వన్ సైడ్ లవ్ పనికిరాదన్నారు. తాను లవ్ చేస్తే చాలాదని అవతల నుండి అంగీకారం రావాలి కదా అన్నారు. అంటే పొత్తు పెట్టుకునేందుకు తాను ప్రతిపాదించినా పవన్ సమాధానమేమీ చెప్పలేదని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.
ఇక రెండోరోజు పొత్తుల విషయం మాట్లాడుతు జగన్ను అధికారంలో నుండి దింపటానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంటే ప్రతిపక్షాలన్నీ ఏకమైతే కానీ జగన్ను ఓడించటం సాధ్యంకాదని అంగీకరించినట్లే. ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యే అవకాశమే లేదని అందరికీ తెలుసు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ కానీ జనసేన కానీ సిద్దంగా లేవు. ఇక వామపక్షాలు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం వల్ల టీడీపీకి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదని కాపులు ప్రత్యేకించి జనసేన నేతలు పవన్ కు ఇప్పటికే స్పష్టంగా చెప్పేశారు. తాము కష్టపడి పనిచేసి చంద్రబాబును సీఎం చేయటానికి సిద్ధంగా లేమని జనసేన నేతలు పవన్ కు చెప్పేశారట. ఈ విషయంమీదే టీడీపీతో పొత్తుకు పవన్ ఇష్టపడటం లేదు. మరిలాంటి పరిస్ధితుల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేదెవరు ? అన్నదే తేలటంలేదు. రేపటి ఎన్నికలకు టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళాల్సొస్తే చంద్రబాబు పనిగోవిందాయేనా ?