హైదరాబాద్ : బీజేపీ నెత్తిన కేసీయారే పాలు పోస్తున్నారా ?

Vijaya


వినటానికి విడ్డూరంగా ఉన్నా వాస్తవమైతే ఇదే. ఎందుకంటే గడచిన రెండు రోజులుగా తెలంగాణాలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టుతో అట్టుడికిపోతోంది. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఇంతకీ బండి చేసిందేమిటి ? ఏమిటంటే నిరుద్యోగ సమస్య+ఉద్యోగాల భర్తీ డిమాండ్ తో బండి దీక్ష చేశారు. ఈ దీక్షలో అనుమతులు తీసుకోకుండా పెద్దసంఖ్యలో జనాలు గుమిగూడారట. దాంతో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బండితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టులు చేశారు. అరెస్టు సందర్భంగా పోలీసులపై దాడి చేశారనే కేసు కూడా పెట్టారు బండిపై. అన్నీ కలిపే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  




అరెస్టు చేసేన బండి కరీంనగర్ పోలీసు ట్రైనింక్ సెంటర్లో ఉంచారు. ఇప్పుడా అంశమే తెలంగాణాలో నిప్పు రాజేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కోవిడ్ నిబంధనలను సామాన్యులు తప్ప రాజకీయ పార్టీల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోవటంలేదు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవటమే బండి చేసిన పెద్ద నేరమైతే ఇదే నేరాన్ని కేసీయార్ తో సహా చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు చేస్తునే ఉన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీయార్ తో పాటు ఎంతమంది మంత్రులు నిబంధనలు పాటించారు ?




మరి వాళ్ళందరిపైనా కేసులు పెట్టారా ? బహిరంగసభలు, ర్యాలీల్లో పాల్గొన్న మంత్రులు, ఎంఎల్ఏలు, జనాలపైన పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు ? ఇక్కడ జరుగుతున్నదేమంటే బీజేపీ నేతలు ఏదో కారణంతో ప్రభుత్వంపై జనాలను ఉసిగొల్పతున్నారు. దీక్షలని, నిరసనలని, ర్యాలీల పేరుతో నానా గోల చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అందుకనే ఇపుడు బండి అండ్ కో పై కేసులు పెట్టి అరెస్టులు కూడా చేసింది. ఇక్కడే ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది. దీక్ష చేసిన తర్వాత బండిని వదిలేయాల్సింది. అంతేకానీ కేసులని, అరెస్టులని, పీటీసీకి తరలించటం, కోర్టుకు తీసుకెళ్ళటం 14 రోజుల రిమాండ్ కు తరలించటంతో  కమలంపార్టీకి లేని ప్రచారాన్ని ప్రభుత్వమే చేస్తున్నట్లయ్యింది.




ప్రభుత్వానికి నిరసనగా రాష్ట్రంలోని బీజేపీ నేతలు, శ్రేణులు రోడ్లపైకి వచ్చారు.  దానికి మీడియా విస్తృతంగా కవరేజి ఇస్తోంది. దాంతో బీజేపీకి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అంటే ప్రభుత్వమే బీజేపీకి ప్రచారం చేస్తున్నట్లయ్యింది. బండిని అరెస్టు చేయకుండా చూసీ చూడనట్లు వదిలేసుంటే ఇపుడీ గొడవంతా ఉండేదికాదు, రాష్ట్రంలో నిరసనలుండేవి కావు. ఏదో కారణంతో కమలంపార్టీలోని నేతలందరినీ ప్రభుత్వమే ఏకం చేస్తున్నట్లుంది. అంటే ప్రభుత్వమే బీజేపీని పెంచి పోషిస్తున్నట్లే ఉంది. చిరవకు ఏమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: