పండగకు ఊరెళ్తున్నారా.. ఛార్జీలు ఎంత పెంచారంటే?
ప్రైవేటు బస్సుల్లో పండుగ ప్రత్యేకంగా భారీగా టికెట్ రేట్లు పెరిగాయి. ఒక్కో టికెట్‌పై ఏకంగా 300 నుంచి 500 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ఈ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలతో పోలిస్తే దాదాపు డబుల్ ఉంటున్నాయి. ఓ కుటుంబం పండుగకు ఇంటికి వెళ్లాలంటే.. వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీలో ఈ నెల 8 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో పండుగ రద్దీ మరింద పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ 14, 15, 16 తేదీల్లో వస్తున్నందువల్ల 12, 13 తేదీల్లో బస్సుల్లో ఫుల్ రష్ ఉంటుంది.
ప్రయాణికుల డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ నెల 12, 13 తేదీల్లో విజయవాడ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే బస్సు చార్జీలు విపరీతంగా పెంచేశారు. ప్రైవేటు బస్సులు నాన్ ఏసీ అయితే.. ఒక్కో బెర్త్ రూ.900 నుంచి 1,200 వరకు రేట్లు ఉన్నాయి. అదే ఏసీ స్లీపర్ బస్సుల్లో అయితే రూ.1,300 నుంచి 1,600 వరకు రేట్లు ఉన్నాయి. మరి కొన్ని ఏసీ బస్సుల్లో అయితే ఈ రేటు రూ.2 వేల వరకూ ఉంది. ఇదే ఆర్టీసీ బస్సులో అయితే.. విజయవాడ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ రేటు రూ.504 ఉంటే.. వెన్నెల ఏసీ సీటర్ రేటు రూ.578గా ఉంది. అదే స్లీపర్ అయితే రూ.888గా ఉంది.
పండుగకు సొంతూళ్లకు వెళ్లాలన్న ప్రజల కోరికను ఇలా ప్రైవేటు బస్సు యజమానులు అవకాశంగా తీసుకోవడం ఏటా జరుగుతున్నదే.. అయితే.. అధికారులు కాస్త చొరవ తీసుకుని ఈ దోపిడీని అరికట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.