పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

RATNA KISHORE
సినిమా ఏదయినా జ‌గ‌న‌న్న మాత్రం త‌గ్గ‌డు. సినిమా ఎవ‌రిది అయినా జ‌గ‌న‌న్న మాత్రం వెన‌క్కు తిరిగి చూడ‌డు. సొంత వాళ్లు నిర్మాత‌ల‌యితే మీకెందుకీ వ్యాపారం మానుకోండి అని చెప్తాడు. అదే పై వారు అయితే ఈ వ్యాపారం ఎంతొస్తుంద‌ని ఆరా తీస్తాడు. ఏద‌యినా అంటాడు చేస్తాడు.. ఎందుకంటే ఆయ‌న సీఎం. వైఎస్ జ‌గ‌న్ అంటే సీఎం. అందుకు త‌గ్గ ఏర్పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఉంద‌ని ఆయ‌న ధీమా! ఒక సినిమాను చంపేసి ఆ చిత్రం తీసిన వారి బ‌తుకు రోడ్డున ప‌డేసి కొత్త సినిమాకు ఆలోచ‌న చేయ‌నివ్వ‌కుండా చేయ‌డంలో వైసీపీ స‌ర్కారు ముందుంటుంద‌ని టీటౌన్ వ‌ర్గాలు గ‌గ్గోలు పెడుతున్నాయి.
పొరుగు రాష్ట్రంలో ఐదో షోకు అక్క‌డి సీఎం అనుమ‌తులు ఇస్తే ఇక్క‌డ మాత్రం అస్స‌లు అలాంటివేవీ వ‌ద్దు అని చెప్పి, సినిమాను సంబంధిత ఆదాయాన్నీ హాయిగా నియంత్రించేందుకు ఒక విధ‌మ‌యిన ప్ర‌ణాళిక రూపొందించి అమ‌లు చేస్తున్నారు. ఎంతటి భారీ బ‌డ్జెట్ చిత్రం అయినా దాని లైఫ్ 3 రోజులే! అయినా కూడా జ‌గ‌న్ వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.
తాను అతి త‌క్కువ ధ‌ర‌కే వినోదం ఇవ్వాల‌ని అనుకుంటున్నా న‌ని ప‌దే ప‌దే మాట‌లు చెబుతూ  నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ పెద్ద‌లు కొంద‌రు రాయ‌భారానికి వెళ్లినా కూడా ఆయ‌న ఎవ్వ‌రి మాట విన‌ని సీత‌య్య‌లా ఉన్నార‌ని ఇక్క‌డే కాదు ఏ విష‌యంలో కూడా ఆయ‌న త‌గ్గ‌డం లేద‌ని స‌ల‌హాదారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో సినిమా టికెట్ వ్య‌వ‌హారాలు కొంత మేర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. దీన్నొక ఆదాయ మార్గంగా కాకుండా జీవ‌నోపాధి మార్గంగా చూడాల‌ని సినిమా ఇండ‌స్ట్రీ వాళ్లు నెత్తీ నోరూ కొట్టుకుని చెబుతున్నా వినిపించుకోని జ‌గ‌న్ ను ఇక‌పై త‌మ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల ద్వారా అడ్డుకోవాల‌ని సినిమా ఇండ‌స్ట్రీ భావిస్తోంది. అందుకు బీజేపీని రంగంలోకి దించి ఢిల్లీ పెద్ద‌ల ద్వారా ఏమ‌యినా చెబితే వింటారేమో అని భావిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: