ఆ పత్రికాధిపతిని చూసి టీడీపీ నేతలు కుళ్లుకుంటున్నారా..?
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను చూసి టీడీపీ నేతలు కుళ్లుకుంటున్నారట.. చంద్రబాబు దగ్గర ఆయనకు ఉన్న పలుకుబడి చూసి.. తమ కంటే ఎక్కువగా చంద్రబాబు ఆర్కేకు ప్రాధాన్యం ఇస్తున్నాడని కుళ్లుకుంటున్నారట. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. జగన్ సర్కారు తీసుకొచ్చిన ఓటీఎస్ పథకంపై కావాలని రెండు పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని విమర్శిస్తూ పెట్టిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. ఈ ఆర్కే టీడీపీలో నాయకుడిగా ఉన్నా బాగుండేదని.. కానీ అలా కాకుండా అన్నీ తెర వెనుక రాజకీయాలే చేస్తుంటారని విమర్శించారు. నా అక్షరం... నా ఆయుధం అంటూ ఆర్కే జనం మీద పడి స్వైర విహారం చేస్తున్నాడని సజ్జల మండిపడ్డారు.
అంతే కాదు.. ఆంధ్రజ్యోతి పత్రిక పైనా సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి మూతపడిన తర్వాత మళ్లీ ఎలా ప్రారంభమైందనే విషయంలో పెద్ద స్కామ్ ఉందన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికకు ఫండింగ్ ఎలా వచ్చింది అనే దాన్ని తవ్వి తీస్తే అదో పెద్ద స్కామ్ అవుతుందంటున్నారు. విమర్శలు చేయడం తప్పు కాదని.. కానీ.. జగన్ ప్రవేశపెట్టిన పథకాలపై విమర్శలు చేయాలని సూచిస్తున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా నిరాధార వార్తలు రాయడం సిగ్గుచేటు అని విమర్శిస్తున్న సజ్జల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎవరి ఏజెంటో, ఎవరిలో పార్ట్ అనేది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
జగన్ సర్కారు 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు నిర్మించే గొప్ప కార్యక్రమం చేస్తోందని సజ్జల గుర్తు చేశారు. 25వేల ఎకరాల భూమిని తీసుకుని.. సదుపాయాల కల్పన కోసం రూ. 34వేల కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు, డ్రైనేజ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని సజ్జల అంటున్నారు. పేదల కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని మంచి అనేందుకు కూడా టీడీపీ పత్రికలకు మనసు రాదని సజ్జల విమర్శించారు. చంద్రబాబు , రాధాకృష్ణకు పేదలంటే ఏమైనా ఏహ్య భావం ఉందంటున్న సజ్జల.. పేదలు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలనే వారు కోరుకుంటున్నారన్నారు.