సీజన్ 3 : బూస్టర్ డోస్ ఎవరికి? ఎందుకు?
కరోనాకు సంబంధించి ఇప్పటికే చాలా దేశాలు ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. కొన్ని అయితే సఫలీకృతం కాగా మరికొన్ని ఇంకా ప్రయోగదశను దాటలేకపోతున్నాయి. మూడు దశ రాక నేపథ్యంలో బూస్టర్ డోస్ వేయించుకోవాలా వద్దా అన్నది చర్చ నడుస్తోంది. అదేవిధంగా అందరికీ బూస్టర్ డోస్ అందించాలా వద్దా అనే విషయమై కూడా కొంత చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిపుణులు బూస్టర్ డోస్ పై ఓ స్పష్టత ఇచ్చారు. అదేంటంటే???
కరోనా సీజన్ 3 మొదలయిపోయింది. ఆ మేరకు భయం ఆ మేరకు ఆందోళన కూడా మొదలయి ఉన్నాయి. ఇప్పటిదాకా రెండు దశల్లో కరోనా కారణంగా ఆర్థికంగా కుదేలయిపోయిన యావత్ ప్రపంచానికి మూడో దశ రాక కంటి మీద కనుకు లేకుండా చేస్తుంది.ముఖ్యంగా ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది కరోనా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ తిండికి లేక అవస్థ పడిన దాఖలాలూ ఉన్నాయి. ఉత్తర భారతావని నుంచి ఇక్కడికి చేరుకున్న వారికి తమ స్వస్థలాలకు వెళ్లాలంటేనే నానా ఇబ్బందులూ తలెత్తాయి. ఈ నేపథ్యంలో మూడో దశ కరోనా రాకపై ఎన్నో అనుమానాలు ఉండేవి. వస్తుందని కొందరు, రాదని కొందరు వాదించారు. కథనాలు అందించి వాగ్వాదం పెంచారు. ఇప్పుడు కొత్త వేరియంట్ రాక తో అన్ని అనుమానాలూ తీరిపోయాయి. ఒమిక్రాన్ వేరియంట్ పై రకరకాల పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో వ్యాధిని నియంత్రించేందుకు వేరియంట్ ప్రభావం శరీరంపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు కూడా కొన్ని అధ్యయనాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ వేసుకోవాలా వద్దా అన్న సందేహం వెన్నాడుతోంది కొందరికి.
ఈ సందర్భంలో వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు బూస్టర్ డోస్ తప్పక వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. అదేవిధంగా నిత్యం కరోనా రోగుల మధ్య పనిచేసే వైద్య సిబ్బందికి బూస్టర్ డోస్ తప్పనిసరి అని కూడా అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు తప్పని సరిగా మూడో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలనే చెబుతున్నారు నిపుణులు.