త్వరలో చేయబోయే లేదా చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు వెలువరించేందుకు ఏపీ సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో ఇంకా ముఖ్యంగా పనిచేసే శ్రీకాకుళం రాజకీయంగా టీడీపీకి ఏమీ లేకుండా చేయాలన్న తలంపులో ఉన్నారు. అందుకే టీడీపీకి ఏమీ మిగల్చకుండా వెలమ కాళింగ కాపు సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకుంటూనే వైశ్య సామాజిక వర్గ నేతలను ( వెలమ, కాళింగ, కాపు లకు వెన్నుదన్నుగా ఉండే సామాజికవర్గ ప్రతినిధులు) కూడా చాకచక్యంగా తనవైపు తిప్పుకుంటున్నారు. శ్రీకాకుళం నగరంలో ధర్మానకు అనుగుణంగా మొన్నటి ఎన్నికల్లో వైశ్య సామాజికవర్గం నుంచి మద్దతు లేదు. కానీ ఇప్పుడు అదే కోమట్ల నుంచి తనకు మద్దతు ఉంటుందనేందుకు వీలుగా లేదా తన వారికి మద్దతు ఉంటుంది అనేందుకు వీలుగా దివంగత వ్యాపారి అంధవరపు వరం (మాజీ మున్సిపల్ చైర్మన్) కొడుకు సంతోష్ కు దగ్గరగా తన వారిని మసులుకోమని ఆ విధంగా కోమట్ల ఓట్లను వైసీపీ వైపు పడేలా చేయమని చెబుతున్నారు. కనుక రానున్న ఎన్నికల్లో ధర్మాన పోటీ చేసే వీలు లేకపోయినా తన వారిని గెలిపించుకోవాలన్న తాపత్రయం ఉంది. ఇక ఎంపీ గా పోటీచేసేందుకు కూడా సిద్ధం కావాలని ఓ సందర్భంలో జగన్ చెప్పారని, అలానే అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సీఎం అన్నారని తెలుస్తోంది. కానీ తనకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చేశారు ధర్మాన అని సమాచారం.
ఈ తరుణంలో రానున్న ఎన్నికల్లో కాళింగ సామాజిక వర్గ ప్రతినిధులుగా ఉన్న కిల్లి కృపారాణికి కానీ దువ్వాడ శ్రీను కానీ ఓ అవకాశం దక్కేందుకు వీలుంది. ఇదే సమయాన రెడ్డి శాంతి కూడా తన తరఫు విన్నపం విన్నవించి ఉన్నారు. ఆమె కాపు సామాజిక వర్గ ప్రతినిధి. ఇటీవలే ఈ కుటుంబాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు వైఎస్ జగన్. ఆమె సోదరుడు పాలవలస విక్రాంత్ కు ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఆమె తల్లి పాలవలస ఇందుమతికీ, అదే విధంగా పాలవలస వారింటి కోడలు (విక్రాంత్ భార్య) జెడ్పీటీసీ పదవులు దక్కేలా చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో సీతారాం ను ధర్మాన ను వాడుకునేందుకు వీలుంగా పొలిటికల్ కోర్ కమిటీలో చోటిచ్చి వారి సేవలు వినియోగించుకోవాలని యోచిస్తున్నారు జగన్. అయితే సీతారాం మాత్రం తనకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ధర్మాన ఇందుకు విరుద్ధంగా అసలు తనకు పదవేమీ వద్దనే అంటున్నారు. ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో పదవి తీసుకుని పనులు చేయక, చేయించలేక ఉన్న పేరు పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదనే అంటున్నారు ధర్మాన. ఈ క్రమంలో ఆ ఇద్దరిపై ఫోకస్ ఉంచారు జగన్.