ఏపీ పోలీసులకు జై భీమ్ సినిమా చూపించండ్రా!
హక్కులన్నవి అందరికీ ఉంటాయి. అందరివీ అయి ఉంటాయి. అనంతపురం విద్యార్థి హక్కులు కాపాడాల్సిన బాధ్యత పోలీసుది. రక్షణ వ్యవస్థ నీడలో చాలా మంచే జరగాలి. జరుగుతుంది అన్న ఆశ కూడా మనలోనే ఉండాలి. ఆ ఆశను సజీవం చేసే బాధ్యత కూడా పోలీసుదే! కనుక నిన్నటి వేళ ఎస్ ఎస్ బీఎన్ కళాశాలలో రెచ్చిపోయిన పోలీసులు కాస్త ఆలోచిస్తే మేలు. నిన్నటి వేళ విద్యార్థి కాలర్ పట్టుకున్న పోలీసు కాస్త వెనక్కు తగ్గి ఉంటే ఇంకా మేలు. చెప్పానుగా పబ్లిక్ ను దాటి ఎ వ్వరూ పోలేరు. జగన్ అయినా కేసీఆర్ అయినా పబ్లిక్ ను రెస్పెక్ట్ చేయాల్సిందే! జీతాలు అందుకుంటున్న పోలీసులు జీతాలకు అనుగుణంగా పనిచేయాలి అనుకోవడంలో అస్సలు తప్పు లేదు. అందుకు వారిని మనం గౌరవించాలి కూడా! కానీ అక్కడ తప్పో ఒప్పో ఏదో ఒకటి ఓ స్టూడెంట్ కాలర్ పట్టుకుని ఎలా నిలదీస్తారు.
అవును ఆ కాలేజీ తప్పులు చేస్తోంది. దిద్దాల్సిన బాధ్యత ఎవరిది పోలీసుది కాదు కానీ ఎవరో ఆడమన్న విధంగానో, లేదా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పేరిటో ఇలాంటి డ్రామాలు నడపడం తప్పు. గతంలో చంద్రబాబు హయాంలో పోలీసులు తప్పులు చేశారు. ఇప్పుడు జగన్ హయాంలో పోలీసులు తప్పులు చేస్తున్నారు. మరి! వీరిని ఏమనాలి? ఎందుకని పోలీసులు విద్యార్థుల కాలర్ పట్టుకున్నారు. ఎందుకని రాళ్లు రువ్వుకునేలా అక్కడున్న సిట్యువేషన్ ను తీసుకు వచ్చారు. డియర్ సర్ ఒక్కసారి ఆలోచించి ఏమయినా చేయండి. ఏదేమైనప్పటికీ పోలీసులు ఏమయినా ఆకాశం నుంచి ఊడి పడరు. చొక్కాకు తారలు అదేలేండి స్టార్లు తగిలించుకుని డిజిగ్నేషన్ ఏంటన్నది కాస్త పొగరుగా చూపించినంత మాత్రాన జనం నుంచి వారేం ప్రత్యేకమూ కాదు. అలా అని వారేమయిన ప్రత్యేక శక్తీ కాదు. పోలీసులు ఈ వ్యవస్థలో భాగం. గౌరవ వ్యవస్థలను గౌరవించడం మనందరి కర్తవ్యం. అది మరిచిపోయి పోలీసులు కానీ ఇటు ప్రజలు కానీ ప్రవర్తించకూడదు.