బాబోయ్‌ కరోనా.. 5 లక్షల మంది మరణిస్తారట..?

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. ఇండియాలో పరిస్థితి దాదాపు పూర్తిగా అదుపులోకి వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. గతంలోనూ ఇలాగే ఓ సారి సాధారణ స్థితికి చేరుకున్నాక రెండో వేవ్‌ విజృంభించింది. అందుకే మూడో వేవ్‌ కూడా రావచ్చని కొన్నాళ్ల క్రితం వరకూ నిపుణులు అంచనా వేసారు. కానీ.. ఎలాగో మూడో వేవ్‌ జాడ ఇప్పటివరకూ లేదు. అయితే.. యూరప్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.


యూరప్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందులోనూ వేగంగా పెరుగుతోంది. దీంతో అక్కడ మూడోవేవ్ మొదలైందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ముందు ముందు యూరప్‌లో కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. యూరోపియన్‌ దేశాల్లో ఇప్పటికే కొవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూరప్‌లోని చాలా దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.


వ్యాక్సినేషన్‌లో ఆలస్యమే వైరస్‌ విజృంభణకు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.  వారం రోజుల్లోనే కొవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రెట్టింపయిందట. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. యూరప్‌లో ఫిబ్రవరి నాటికి కరోనాతో ఐదు లక్షల మంది మరణించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  వార్నింగ్ ఇచ్చింది. యూరప్‌లో వైరస్‌ ప్రభావం గతంలో కంటే అధికంగా ఉన్న నేపథ్యంలో కరోనాను అధిగమించేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నద్ధం కావాలని యూరోపియన్ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.


కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే పెను ముప్పు తప్పదని  ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. యూరప్‌తో పాటు మరికొన్ని దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సెకండ్‌ వేవ్‌ స్థాయిలో విజృంభించకపోయినా కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఆ మహమ్మారి మరోసారి పంజా విప్పే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: