హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి అటు గులాబీ శ్రేణులు, ఇటు కాషాయ శ్రేణులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నాయి. గతంలో కన్నా ఎక్కువగా రాణించాలన్న పట్టు ఈటెలది అయితే, ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలన్న పంతం కేసీఆర్ వర్గానిది. ఈ పోరులో గెల్లు శ్రీను అనే ఓ విద్యార్థి నేత ఏవిధంగా నెట్టుకువచ్చాడు అన్నదే ఆసక్తిదాయకం. పెద్దగా ఆర్థిక మూలాలు అంటూ లేని గెల్లు శ్రీను ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అన్నది పెద్దగా జరగని పని చాలా మంది అంటున్నారు. అయితే ఆఖరి నిమిషయంలో అధికార పార్టీ రిగ్గింగుకు పాల్పడిందన్న ఆరోపణలు అయితే బీజేపీ చేస్తోంది. దీంతో ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది తేలాలంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సిందే! ఇక గెల్లు శ్రీను కు మరో టెన్షన్ కూడా ఉంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తన భవిష్యత్ రాజకీయం ఏంటన్న ప్రశ్న కూడా వెన్నాడుతోంది. చిన్న స్థాయి నుంచి ఎదిగివచ్చిన నేతగా పేరున్న గెల్లు శ్రీనుకు ఇప్పటిలానే మున్ముందు కూడా కేసీఆర్ మద్దతు ఇస్తారా లేదా అన్నది సంశయాత్మకం. మరోవైపు కేసీఆర్ వర్గం పంచిన ఒక్కో ఓటరుకు ఆరు వేల రూపాయలు ఏ మేరకు ప్రభావం చూపాయి అన్నది ఆసక్తికరంగా ఉంది.
వాస్తవానికి మొదట్నుంచి ముందంజలో ఉన్న ఈటెల ప్రచారంలోనో పోలింగ్ లోనూ పోల్ మేనేజ్మెంట్ లోనూ దూసుకుపోయారు.అయితే గులాబీ దండును ముందుకు నడిపి, ప్రచార భారం అంతా తానే మోసిన హరీశ్ రావు మాత్రం చాలా కష్టాలే చవి చూశారు. ఎందుకంటే తన మిత్రుడిపై ప్రశ్నాస్త్రాలు సంధించినప్పుడు అవి తిరిగి సూటిగా తమని తామే ప్రశ్నిస్తున్న విధంగా ఉండేవి. దీంతో ప్రచారాస్త్రాలు పెద్దగా ఆయన వాడలేకపోయారు. సుదీర్ఘ స్నేహం కూడా ఓ కారణంగా మారిపోయింది. ఈటెల అవినీతి ప్రస్తావనే లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే వార్ వన్ సైడ్ గా మారిపోయింది.
అయినా కూడా అధికారం ఉందన్న సాకుతో గులాబీ దండు తన పని తాను చేసుకుని పోయేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. డబ్బు పంపిణీలో రెండు పార్టీ ఒకదానిపై ఒకటి ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించినా ఆఖరికి ఈ విషయమై విజయం కేసీఆర్ గ్రూపునే వరించింది. పోలీసులే దగ్గరుండి పంపిణీ పనులు పర్యవేక్షించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇలా చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుమ జరిగిన ఈ ఉప ఎన్నిక ఖర్చు అనధికారికంగా ఐదు వేల కోట్లు అధికారికంగా 1200 కోట్లు. మొత్తం 7200 కోట్లు..అని ఓ అంచనా! ఇది కేవలం ప్రాథమిక సమాచారం అనుసరించి రాసిన వార్త మాత్రమే!