రేప్ ద్వారా గర్భం వస్తే.. తీయించుకోవచ్చన్న హైకోర్టు
అక్కడ బాలిక గర్భం దాల్చినట్లు.. పిండం వయస్సు 25 వారాలు ఉన్నట్టు నిర్థరణ అయ్యింది. తల్లిదండ్రులు ఆరా తీస్తే ఆంజనేయులు అనే వ్యక్తి కారణమని బాలిక చెప్పింది. అతనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. బాలికకు అబార్షన్ చేసేందుకు ఆసుపత్రి నిరాకరించారు. దీంతో బాధితురాలి తల్లి హైకోర్టుకు వెళ్లారు. విచారించిన హైకోర్టు.. బాలిక ఆరోగ్య పరిస్థితిపై కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్, మరో ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.
బాలికను పరిశీలించిన వైద్యులు.. గర్భాన్ని తొలగించవచ్చని, అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, మత్తుమందు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అందువల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని నివేదికలో చెప్పారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి అబార్షన్ చేసేందుకు ఆసుపత్రికి అనుమతి ఇచ్చింది. నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ అబార్షన్ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అయితే.. పిండం నుంచి టిష్యూ, రక్త నమూనా, డీఎన్‌ఏను సేకరించి భద్రపరచాలని కోర్టు ఆదేశించింది.
రేప్ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపి నివేదికలు తెప్పించాలని హైకోర్టు చెప్పింది. రక్త నమూనాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ ఫలితాలను కేసు విచారణ కోసం భద్రపరచాలని ఆదేశించింది. చట్టం ప్రకారం పిండం వయస్సు 24 వారాల కంటే ఎక్కువ ఉండకూడదని.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నపుడు అబార్షన్ కి ఆదేశాలిచ్చే అధికారం కోర్టులకు ఉందని హైకోర్టు తెలిపింది. పిండం హక్కులతో పోల్చినపుడు అత్యాచారానికి గురైన బాలికకు రాజ్యాంగం కల్పించిన హక్కులకే ప్రాధాన్యం ఉంటుందని కోర్టు చెప్పింది.