పవన్ పవర్ : శ్రమ జనసేనది ఫలితం టీడీపీకి ?

RATNA KISHORE
రహదారుల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త జన జీవనం పై , వారి అవస్థలపై పవన్ స్పందిస్తున్నారు. శ్రమదానం చేసి నిరసన తెలిపారు. అదేవిధంగా కొన్ని చోట్ల రహదారులకు పూర్తి స్థాయిలో మరమ్మతులకు చందాలు పోగేసుకునేందుకు సైతం జన సైనికులు ముందుకు వస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా జనసేన చేసే పోరాటాలకు టీడీపీ బాహాటంగా మద్దతు ఇవ్వడం లేదు. ఎన్నికల్లో మాత్రం పొత్తులు పెట్టుకుని జనసేన చేసిన కష్టాన్నంతటినీ తన ఖాతాలో వేసుకుంటోంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ పార్టీకి లేనంత సౌలభ్యం లేదా సౌకర్యం ఒక్క టీడీపీకే ఉంది.


ఈ ఒక్క విషయంలో పవన్ ను తప్పుపట్టాల్సిందే. ఆశించిన స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టకపోవడం అన్నది ప్రతిసారీ పవన్ చేస్తున్న తప్పు. అందుకే ఆయన తరుచూ ఫెయిల్ అవుతున్నారు. మంచి అభ్యర్థుల ఎంపిక, వారి గెలుపునకు చేసే కృషి అన్నవి ఎంత ముఖ్యమో జనసేనాని గుర్తించడం లేదు. దీంతో ఐదేళ్ల పాటు జనంలో ఉంటూ కష్టపడి పనిచేసే జనసైనికులు తరువాత కాలంలో ఎటువంటి పదవులూ లేక, రాజ్యాధికారం దక్కక అవస్థ పడుతున్నారు.


వచ్చే ఎన్నికల్లో పవన్ - చంద్రబాబు కలిసి పనిచేయనున్నారని మొన్నటి జనసేనాని ప్రసంగంతో తేలిపోయింది. పవన్ తన వర్గ శత్రువు వైసీపీ అని తేల్చేశారు. అదేవిధంగా తాము వైసీపీ పాలనకు చరమగీతం పాడడమే ప్రధాన విషయంగా భావిస్తున్నామని కూడా చెప్పారు. వైసీపీ పాలనకు రౌడీయిజం చెలామణీ అవుతుందని, తమ కార్యకర్తలపై తరుచూ దాడులు జరుగుతున్నాయని కూడా పవన్ ఆరోపించారు. ఎన్ని జరిగినా తాను సహిస్తున్నానని, కానీ సమయం వచ్చినప్పుడు తమ కార్యకర్తల తిరుగుబాటు ని చవి చూడాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేనాని చెప్పిన మాటలు వైసీపీ అస్సలు పట్టించుకోవడం లేదు.
వాటినన్నింటినీ అసందర్భం అయిన మాటలుగానే భావిస్తోంది. అంతేకాకుండా తమకు రాజకీయ ప్రత్యర్థులంటూ ఎవ్వరూ లేరని, రానున్న కాలంలో తమదే అధికారం అని కూడా అంటోంది. ఇవి ఎలా ఉన్నా జనసేన చేసే ప్రతి పనీ టీడీపీకి ఉపయోగపడుతుంది అన్నది వాస్తవం. జనసేన చేసే ప్రతి తిరుగుబాటు టీడీపీకి సహకరిస్తుంది అని చెప్పడం కూడా నిజం. అంతేకాకుండా జనసేన చేసే ప్రతి ఆలోచన కూడా టీడీపీ విజయం కోసమే అన్నది కూడా నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: