చైనాను కుమ్మేస్తున్న డెల్టా వైరస్..?

Chakravarthi Kalyan
చైనా.. ఇది కరోనా పుట్టిళ్లు.. ఇప్పుడు అక్కడే జీవం పోసుకున్న కరోనా వైరస్..తన రూపు మార్చుకుని మరింత శక్తివంతమై పుట్టింటిపై దాడికి దిగింది. కరోనాలోని కొత్త డెల్టా వేరియంట్ ఇప్పుడు చైనానూ వణికిస్తోంది. మొదటి కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కున్న చైనా.. ఈ డెల్టా వేరియంట్ విషయంలో మాత్రం తడబడుతోంది. వేగంగా వ్యాపించే లక్షణం ఉన్న డెల్టా రకం కరోనా వైరస్‌ ఇప్పుడు చైనాను కమ్మేస్తోంది. డెల్టా వైరస్‌ దెబ్బకు ఇప్పుడు డ్రాగన్‌ దేశం అల్లాడుతోంది.


చైనాలో డెల్టా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే.. ఆ దేశంలోని 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపించింది. పాత కరోనా కట్టడిలో విజయవంతమైన చైనాకు ఇప్పుడు డెల్టా వైరస్‌ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడు చైనాలో డెల్టా వైరస్‌ తీవ్రత మధ్యస్థాయి, తీవ్రంగా ఉన్న ప్రాంతాల సంఖ్య ఏకంగా 95కి పెరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’చెబుతోంది.


గ్లోబల్ టైమ్స్ చెబుతున్న దాని ప్రకారం చైనాలోని  డెహోంగ్‌, నన్‌జింగ్‌, ఝెంగ్‌జౌ వంటి ప్రాంతాల్లో డెల్టా ముప్పు తీవ్రంగా ఉందట. ఇప్పుడు క్రమంగా ఈ డెల్టా రాజధాని బీజింగ్‌కు కూడా పాకింది. ఆదివారం అక్కడ మూడు డెల్టా కేసులు బయటపడ్డాయి. అందుకే కొవిడ్‌ వ్యాప్తి ఉన్న ప్రావిన్సుల నుంచి బీజింగ్‌కు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చైనాలో తాజా కొవిడ్‌ ఉద్ధృతి మొదట నన్‌జింగ్‌ విమానాశ్రయంలో కేసులు బయటపడింది.


నన్‌జింగ్‌ లో ఇప్పటి వరకూ 204 డెల్టా కేసులు బయటపడ్డాయి. అయితే చైనాలో తాజాగా వెలుగు చూస్తున్న కొత్త కేసులకు ఝాంగ్‌జియాజీలోని ఓ గ్రాండ్‌ థియేటర్‌లో ప్రదర్శించిన ఒక షో కారణంగా భావిస్తున్నారు.  ఈ షోకు 2 వేల మంది హాజరయ్యారు. ఈ నగరంలో కరోనా విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌  కూడా విధించారు. మొత్తానికి మళ్లీ చైనాలోనూ లాక్‌డౌన్‌లు కూడా ప్రారంభమయ్యాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: