అలా చేస్తేనే అఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొంటుంది: ఇమ్రాన్ ఖాన్

Suma Kallamadi
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఆయన మిలటరీతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారని మిలటరీ ఏది చెబితే అదే పాకిస్తాన్ లో నడుస్తోందని గతంలో ఆరోపించారు. కానీ ప్రస్తుతం అటువంటి ఆరోపణలు ఏమీ రావడం లేదు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ... అఫ్ఘనిస్తాన్ తో ప్రపంచ పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా తీరు సరికాదని అన్నారు. అమెరికా పై తీవ్ర ఆరోపణలు చేశారు.

తాలిబన్లకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తానే ఆయుధాలు సమకూరుస్తోందని అమెరికా తాజాగా ఆరోపణలు గుప్పించింది. దీనిపై స్పందించిన ఇమ్రాన్ అమెరికావి తప్పుడు ఆరోపణలని బదులిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తాలిబన్లు కూడా అందరిలాగే సాధారణ పౌరులేనని వివరించారు. అలాంటపుడు వారికి సాయం కోసం శరణార్థులుగా వస్తే తాము సాయం చేయడం తప్పెలా  అవుతుందని ప్రశ్నించారు. వారు ఏమైనా మిలిటరీనా అని అన్నారు. అమెరికా అధికారులు పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో 30 లక్షల మంది ఆప్ఘన్ శరణార్థులు ఉన్నారని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. వారిని తాము ఎలా ఏరివేయగలమని ప్రశ్నించారు. శరణార్థులకు సాయం చేస్తున్నామే కానీ తాలిబన్లకు ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఆయుధాలు కానీ అందజేయడం లేదని స్పష్టం చేశారు. అమెరికా అధికారులు పాకిస్తాన్ దేశం తాలిబన్లకు సాయం చేస్తోందని గాలి మాటలు మాట్లాడుతున్నారని ఏవైనా ఆధారాలుంటే చూపెట్టాలని సవాల్ విసిరారు. పాకిస్తాన్ దేశంలో ఉన్న అఫ్ఘన్ శరణార్థుల్లో కొంత మంది తాలిబన్లు ఉంటే వారిని గుర్తించడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. అసలు ఆప్ఘనిస్థాన్‌ విషయంలో తప్పందా అమెరికాదే అని అన్నారు. వారు తాలిబన్లతో ముందుగానే రాజకీయ సుస్థిరత కోసం ప్రయత్నించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తాలిబన్లతో కూడిన ప్రభుత్వంతోనే ఆప్ఘన్ లో రాజకీయ సుస్థిరత సాధ్యం అవుతుందేమో అని ఇమ్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: