తనతో సెల్ఫీ దిగాలనుకుంటే 100రూపాయలు ఇచ్చి దిగాలని మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా మంత్రి ప్రకటించారు. మంత్రి ఉషా ఠాకూర్.. ఈ ప్రకటన చేశారు. సెల్ఫీల వల్ల తమ లాంటి నేతలకు ఆలస్యం అవుతుందనీ.. దీంతో పార్టీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇలా వచ్చిన డబ్బును పార్టీ పనుల కోసం వినియోగిస్తామన్నారు. అలాగే బహిరంగ కార్యక్రమాలకు తనను పిలిచే వారు బొకేలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని మంత్రి ఉషా సూచించారు.
ఉషా ఠాకూర్ బీజేపీకి చెందిన బలమైన నాయకురాలు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న లీడరమ్మ. ప్రస్తుత ఉషా ఠాకూర్ మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా జనం ఎగబడి వస్తారు. ఆమెతో కరచాలనం చేసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు ఆరాటపడతారు. ఒకవైపు మంత్రిగా ఉండటం.. పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల తనను కలిసేందుకు వచ్చే నేతలను కాదనకుండా ఫోటోలకు సహకరిస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల తాను ఇతర కార్యక్రమాలకు ఆలస్యంగా వెళుతున్నట్టు చెబుతున్నారు. కాబట్టి తనతో సెల్ఫీ దిగాలనుకునే వారు వంద రూపాయలు ఇస్తే.. నిరభ్యంతరంగా ఫోటోలు దిగవచ్చని ఆఫర్ ఇచ్చారు. వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాల్లో వినియోగిస్తానంటున్నారు. ఇది పార్టీలో చర్చించే ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్టు వెల్లడించారు ఉషా ఠాకూర్. ఇంకేముందీ వందరూపాయలు ఇచ్చి ఆమెతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు.
ఉషా ఠాకూర్ 1966వ సంవత్సరం ఫిబ్రవరి 3న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించారు. ఆమె మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. చిన్ననాటి నుండే కవిత్వం, హిందీ సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత ఎమ్ఏ చదివారు. తర్వాత ఆమె మనసు రాజకీయాల వైపు మళ్లింది. బీజేపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. అలా బీజేపీ అధిష్టానం దృష్టిలో పడి పార్టీ నుంటి టికెట్ దక్కించుకునే స్థాయికి ఎదిగారు. తర్వాత ప్రజల్లో మంచి ఆదరణ పొంది ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నారు.