హైదరాబాద్‌లో అజయ్‌దేవగన్ భారీ మల్టీఫ్లెక్స్ ... ఫుల్ డీటైల్స్ ఇవే..!
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడంపై విశేష ఆసక్తి చూపుతున్నారు. ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అంతకంటే ముందే మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్ ప్రాంతంలో అజయ్ దేవగన్ 'దేవగన్ సినెక్స్' (Devgn Cineplex) పేరుతో ఏడు స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన కర్మాన్‌ఘాట్‌లోని టీఎన్‌ఆర్ ప్రెస్టన్ మాల్‌ను కొనుగోలు చేశారు, దానికి ఇప్పుడు కొలిసియం మాల్ గా పేరు మార్చారు.
ఈ పెట్టుబడులను అజయ్ దేవగన్, విశ్వ సముద్ర గ్రూప్‌తో కలిసి పెడుతున్నారు. ఈ మల్టీప్లెక్స్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. నిజానికి, కొలిసియం మాల్ ప్రాజెక్ట్‌ను టీఎన్‌ఆర్ గ్రూప్ 2010లోనే మొదలుపెట్టింది. 3.5 ఎకరాల్లో, 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో షాపింగ్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక సమగ్ర కేంద్రంగా దీనిని రూపొందించారు. ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్ వంటి కీలక ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో ఇది మంచి మాల్‌గా గుర్తింపు తెచ్చుకుంటుందని భావించారు.
అయితే, బిల్డర్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడంతో ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయింది. చేతులు మారిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ మాల్ పేరును 'కొలిసియం మాల్'గా మార్చారు. అజయ్ దేవగన్ మొదట ఎన్ వై సినిమాస్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు. ఆ తర్వాత దానిని విశ్వ సముద్ర గ్రూప్‌తో విలీనం చేసి దేవగన్ సినెక్స్ గా మార్చారు. విశ్వ సముద్ర గ్రూప్ ఇన్‌ఫ్రా, రియల్టీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ప్రముఖంగా ఉంది. ఈ గ్రూప్‌కు సీఈఓ సీ. శశిధర్, నవయుగ గ్రూప్ కుటుంబ సభ్యుడు. 2024లో నవయుగ నుంచి విడిగా ప్రారంభమైన విశ్వ సముద్ర, ఇప్పుడు 'దేవగన్ సినెక్స్'లో ముఖ్య భాగస్వామిగా నిలిచింది. ఈ రెండు సంస్థలు కలిసి హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, అందులో ఫిల్మ్ స్టూడియో నిర్మాణం కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.