ఆ జిల్లాలో కరోనా రోగుల వింత ప్రవర్తన.. అందరి కొంపా ముంచుతుందా..?
అసలు విషయం ఏంటంటే.. కరోనా సోకిన వారు గల్లంతైపోతున్నారు.. గల్లంతు అంటే ఎక్కడికీ వెళ్లడం లేదు.. కానీ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. మరోవైపు వందల సంఖ్యలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఆచూకీ లభించడం లేదు. కరోనా పరీక్షలకు స్వాబ్ ఇచ్చే సమయంలోనే కొందరు అతి తెలివితో తప్పుడు ఫోన్ నెంబర్లు, చిరునామాలు ఇస్తున్నారు. మరికొందరు ఫోన్‌లు స్విచ్ఛాప్ చేస్తున్నారు.
ఇంకొందరు ఫలితాలు రాకముందే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించడం అధికారులకు పెద్ద కష్టంగా మారింది. ఇలా ఆచూకీ దొరకకుండా తిరిగే కరోనా పాజిటివ్ వ్యక్తుల వల్ల కొవిడ్ వ్యాప్తి మరింత పెరగొచ్చని అధికారులు భయపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల లెక్కలు చూస్తే.. రెండు నెలల్లో 9వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీరిలో 7వేల మంది వరకే అధికారులు గుర్తించగలిగారు.
మరి మిగిలిన 2 వేల మంది ఏమయ్యారన్నది తేలకుండా ఉంది. ఇలాంటి వారిని పట్టుకోవడం.. గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఇలాంటి వారి వల్ల మరింతగా జిల్లాలో కరోనా వ్యాపిస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు పరీక్షలకు ఇచ్చే సమయంలో బాధ్యతగా మెలగాలని కోరుతున్నారు. మొత్తం మీద కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ పాజిటివ్ రోగుల ట్రేసింగ్ చాలా కష్ట సాధ్యంగా మారింది.