జగన్ నెత్తిన పాలు పోసిన మోడీ.. ఇక వైజాగ్‌లో వైసీపీకి ఎదురులేనట్టేనా..?
ఇందులో మోడీ పాత్ర ఏముందంటారా.. విశాఖ ఉక్కుతో రాష్ట్రానికి ఏ సంబంధం లేదని కేంద్రం ఏకంగా పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టేసింది.. ఇక ఇప్పుడు వైసీపీకి ఇంతకంటే ఏం కావాలి.. అసలేం జరిగిందంటే.. విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని.. వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఆమె తేల్చి చెప్పేశారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చేశారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భాగస్వాములు, ఉద్యోగులు షేర్లు కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో కేంద్రం ఇలాంటి ప్రకటన చేయడంతో వైసీపీ ఊపిరిపీల్చుకుంది.
తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పాపం అంతా కేంద్రానిదే అని తేట తెల్లమైంది. ఇక ఇప్పుడు ఇదే అంశాన్ని వైసీపీ ఫోకస్ చేస్తుంది. ప్రచారానికి సమయం ముగిసినా.. ఈ విషయంపై ప్రజలకూ ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ నేతలు ఫుల్ హ్యాపీస్.