శభాష్‌ రమణ : ఆ కుర్ర ఆఫీసర్‌ను.. గిరిజనులెందుకు ఊరేగించారు?

Chakravarthi Kalyan
చిత్తశుద్ధి కల అధికారులు మనసు పెట్టి పని చేస్తే ఎన్ని వేల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయో కళ్లకు కట్టే ఉదాహరణ ఇది. ఓ కుర్ర ఆఫీసర్‌.. గిరిజనులు గోడు విని.. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేసిన ప్రయత్నం అద్భుతం. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించేందుకు ఓ కుర్ర అధికారి పడిన తపన.. తీసుకున్న చొరవ అద్భుతం. ఇలాంటి అధికారులే భవిష్యత్ ఆశాకిరణాలంటే అతిశయోక్తి కానేకాదు. ఇంతకీ ఆ ఆఫీసర్ ఏం చేశారు.. ఆయన మాటల్లోనే చదవండి.
Ramana Akula......
కొండ బడి తరువాత నాకు అత్యంత సంతృప్తి ఇచ్చిన మరో విషయం: గిరిజనులకు RoFR పోడు భూమి పట్టాల పంపిణీ నేను Dy collector గా గుంటూరు జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకొని తూర్పు గోదావరి జిల్లా లో PO ITDA, చింతూరు & RDO, ఏటపాక గా మొదటి పోస్టింగ్ వచ్చిన తరువాత గిరిజనుల నుండి ప్రధానంగా వచ్చిన విజ్ఞప్తి వారు ఎన్నో సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వమని.
దీనికి సంబంధించిన చట్టం: Recognition of Forest Rights(RoFR) Act - 2006. ఈ చట్టం ప్రకారం december 13, 2005 తేదీ నాటికి పూర్వం అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన కుటుంబాలకు 10 ఎకరాలకు మించకుండా వ్యక్తిగత హక్కులు కల్పించడం, అలాగే సామూహిక హక్కులైన అటవీ ఉత్పత్తుల సేకరణ, ఆవాస హక్కు, చేపలు పట్టుట మొ|| హక్కులను కల్పించవచ్చు.
నేను పని చేస్తున్న ఈ నాలుగు మండలాల్లో(చింతూరు, కూనవరం, VR పురం, యేటపాక) ఈ చట్టం వచ్చినప్పటనుంచీ ఇప్పటి వరకు 2300 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే cm గారి ఆదేశాల మేరకు మళ్లీ ROFR పట్టాల గూర్చి ప్రభుత్వ యంత్రాంగం మరోసారి దృష్టి పెట్టింది. అయితే దానితో పాటు నేను వ్యక్తి గతంగా పెట్టు కొన్న మరో లక్ష్యం ప్రతీ గిరిజన కుటుంబానికీ కనీసం 1-2 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని. అంటే అర్హత ఉన్న వాళ్లకు RoFR క్రింద, ఇతరులకు రెవెన్యూ అసైన్మెంట్ చట్టం క్రింద ఇవ్వాలని సంకల్పించాను.
దీని కోసం భూమి లేని కుటుంబాల సర్వే చేపట్టగా దాదాపుగా 10% కుటుంబాలు అనగా 4000 కుటుంబాలకు భూమి ఇవ్వవలసి ఉంది. అందులో కొంత మందికి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నప్పటికీ ఎటువంటి పట్టా లేదు.
దీనికి దాదాపుగా 6 నెలల పాటు పాటు కృషి చేయగా, RoFR చట్టం ప్రకారం 2400 కుటుంబాలకు అర్హత లభించింది. ఇందులో దాదాపుగా 1500 కుటుంబాలు వారి జీవితంలో మొట్టమొదటి పట్టా అందుకొన్న వారు. మరో 800 కుటుంబాలకు రెవెన్యూ అసైన్మెంట్ పట్టాలు సిద్ధం చేస్తున్నాం. అంటే మొత్తంగా 3200 కుటుంబాలకు గాను దాదాపుగా 10,000 ఎకరాల భూ పంపిణీ.
అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది మరియు నాకు స్థానికంగా ప్రతీ విషయంలో ఎదురయ్యే సమస్య ఈ నాలుగు మండలాలు పోలవరం ముంపు మండలాలుగా ఉండటం మరియు ముంపు ఉన్న చాలా గ్రామాల్లో భూ సేకరణ జరిగింది కాబట్టి ఇక ఎటువంటి పట్టాలు ఇవ్వకూడదని దాదాపుగా అందరి అధికారులలో ఉన్న అభిప్రాయం. అయితే అది రెవెన్యూ భూములకు వర్తిస్తుంది కానీ అటవీ పోడు భూములకు వర్తించదు అని నా అభిప్రాయం. తరువాత RoFR చట్టాన్ని, భూసేకరణ & పునరావాస చట్టం-2013 చట్టంతో కలిపి క్షుణ్ణంగా చదివి నా అభిప్రాయం చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందని నిర్ధారణకు వచ్చాను.
మరో ముఖ్య విషయం ఏంటంటే, కేవలం పడవలు, లాంచీల ద్వారా మాత్రమే వెళ్లగలిగే పాపికొండల ప్రాంతంలోని పాములేరు వాగు గోదావరి నదిలో కలిసే ప్రాంతంలో ఇసుక తిన్నెలు, వాగుల వెంట ఉన్న కొల్లూరు, గొందూరు గ్రామాలలో పర్యటించినప్పుడు అక్కడి కొండ రెడ్డి గిరిజనులు మాది ముంపు గ్రామమే కాక పాపికొండలు జాతీయ పార్కు లో ఉండటం వల్ల మాకు ఎటువంటి పట్టాలు రావటం లేదని బాధ పడ్డారు. అక్కడ అటవీ ప్రాంతం కావడం వల్ల ఎవరికి రెవెన్యూ భూములు ఉండవు. వీరు పోలవరం కాలనీల లోకి పునరావాసం జరిగితే గిరిజనులకు భూమికి పరిహారంగా అందే కొంత భూమి కోల్పోతారని, ఎటువంటి భూహక్కు పొందకపోవచ్చు అని అనిపించింది. ఎలాగైనా చట్ట పరిధిలో వీరికి అటవీ హక్కులు కల్పించాలని అనుకొన్నాను. నాకున్న చట్ట పరిజ్ఞానం మేరకు critical wild life కు హాని జరుగకుండా జాతీయ పార్కుల్లో కూడా RoFR పట్టాలు ఇవ్వ వచ్చు. నేను కొల్లూరు, గొందూరు, తుమ్మిలేరు, కొండేపూడి PVTG కొండ రెడ్డిలకు నేను బదిలీ అయ్యి వెళ్ళే లోగా మీ అందరికీ పోడు భూమి పట్టాలు ఇస్తానని మాట ఇచ్చాను.
కాకపోతే ఆ విషయాన్నీ ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా తీసుకొంటే తరువాతి కాలంలో ముఖ్యంగా గిరిజనులకు ఇబ్బంది ఉండదనుకొని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ రంజిత్ భాష, IAS సర్ కి ఉత్తరం రాశాను. అలాగే ITDA Project Officers కు తరచుగా జరిగే మీటింగ్ లలో ఈ అంశాన్ని లేవనెత్తే వాడిని. అలాగే మా కలెక్టర్ గారు శ్రీ మురళీధర్ రెడ్డి, IAS సర్, గిరిజన సంక్షేమ శాఖ ప్రథాన కార్యదర్శి శ్రీ కాంతి లాల్ దండే, IAS సర్ లతో చర్చించగా వీరికి పట్టాలు ఇవ్వటానికి నన్ను ఎంతో ప్రోత్సహించారు. అలాగే cm కార్యాలయం నుండి RoFR పట్టా పర్యవేక్షణకు వచ్చిన శ్రీ సాల్మన్ ఆరోక్య రాజ్, IAS సర్ కూడా అంగీకరించడం ఎంతో సంతోషం అనిపించింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖ లీగల్ అడ్వైజర్ శ్రీ పల్లా త్రినాథ రావు గారు కూడా చేయూత నివ్వడంతో ప్రభుత్వం నుండి రాత పూర్వకంగా అనుమతి లభించింది.
అటవీ పోడు భూమి సర్వే map లు సిద్ధం చేయటం, గ్రామసభ తీర్మానం, నేను ఛైర్మన్ గా గల Sub divisional level committee, కలెక్టర్ సర్ చైర్మన్ గా గల Dist level committee సంతకాలు పూర్తి అవ్వటం తో RoFR పోడు భూముల పట్టాలు ఇవ్వటానికి మార్గం సుగమం అయ్యింది. ముఖ్యంగా పాపికొండల గ్రామాలైన కొల్లూరు గొందూరు కొండ రెడ్డి కుటుంబాలకు శాటిలైట్ మ్యాపులతో సహా పట్టాలను సిద్ధం చేసి చింతూరు DFO సాయిబాబా గారి సంతకం, నా సంతకం & కలెక్టర్ గారి సంతకం తో 120 కుటుంబాల పోడు పట్టాలను పట్టుకొని స్వయంగా లాంచీలో బయలుదేరాను. పట్టాలతో నేను వస్తున్న విషయం తెలియడంతో పిల్లా పాపలతో సహా ఊరు మొత్తం తరలి వచ్చి నన్ను ఊరేగింపు గా గోదావరి ఒడ్డు నుండి నన్ను వారి గ్రామానికి తీసుకెళ్లటం, మొట్టమొదటి సారిగా పట్టా అందుకొన్న వారి ముఖాల్లో ఆనందం చూడటం నా జీవితంలో సంతోషకరమైన మరిచిపోలేని సంఘటన.
నేను పట్టాలు అందిస్తూ వారిని నాకు ఒక మాట ఇవ్వమని అడిగాను. కొండరెడ్డి కుటుంబాల నుండి ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ రావాలనే మాట తీసుకొన్నాను. నేను ట్రాన్స్ఫర్ అయ్యేలోగా పట్టాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నాను. నాకు ఇచ్చిన మాట కూడా కొండ రెడ్డిలు ముఖ్యంగా కొండరెడ్డి యువత త్వరలోనే నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే పోలవరం పూర్తి అయ్యి పునరావాస కాలనీలకు వెళ్ళే ప్రతీ కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తికైనా నైపుణ్య శిక్షణ, స్థిరమైన ఆదాయం అందేలా ఏర్పాటు చెయ్యటం ఈ సంవత్సర మరో లక్ష్యం. అలాగే భూమి లేని గిరిజన కుటుంబం చింతూరు ITDA పరిధిలో ఉండకూడదనే నా లక్ష్యం. మా కలెక్టర్ సర్ మార్గదర్శకంలో మరో 6 నెలల్లో ఈ లక్ష్యం పూర్తిగా తీరుతుందనే నమ్మకం నాకుంది.
- రమణ ఆకుల ‍(ఆర్డీఓ, ఎటపాక మరియు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ )


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: