ఏపీ: వైసీపీ మేనిఫెస్టోలో ఎస్సీల‌కు వ‌రాలు.. కోత‌లు?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికల హడావుడి షురూ అయింది. అభ్యర్థుల నామినేషన్ల పని ముగియడంతో ఎవరికి వారు మేనిఫెస్టోని విడుదల చేసే పనిలో పడ్డారు. ఈసారి ఎలాగన్నా అధికారంలోకి రావాలని టీడీపీ ఆరాటపడుతుంటే, మరోసారి అధికారమే ధ్యేయంగా వైస్సార్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈసారి వైసీపీ ప్రస్తుత పథకాలను కొనసాగిస్తూనే వాటిని విస్తరిస్తూ.. పధకాలకి టచప్ ఇచ్చినట్టు కనబడుతోంది. 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయగా.. ఈ 2024 ఎన్నికలకు 'సామాజిక భద్రత' పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈరోజు అనగా శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమం గురించి పలు వివరాలు పొందుపరచడం జరిగింది. ఎస్సీలకు డీబీటీ ద్వారా గత 5 సంవత్సరాలలో రు. 45,412 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 23,469 కోట్లు అందించడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్టీలకు డీబీటీ ద్వారా 5 ఏళ్లలో ఇప్పటికే రు.13,389 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రు.5,963 కోట్ల రూపాయిలు అందివ్వడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా 2019 మేనిఫెస్టోలో వారు చెప్పినట్టుగా... ఎస్సీలకు 3 (మాల, మాదిగ, రెల్లి తదితర కులాలకు) కార్పొరేషన్లు, పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ల అమలు చేసినట్టు చెప్పుకొచ్చారు. అదే మాదిరి అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించారు. ఇంకా 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తండా, గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఇక ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాలయాల్లో అన్ని ఉద్యోగాలూ స్థానిక గిరిజనులకే కేటాయించారు. గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత వైస్సార్సీపీ పార్టీదేనని ఈ సందర్భంగా చెప్పుకు రావడం కొసమెరుపు. అదేవిధంగా పార్వతీపురం, పాడేరులో రెండు మెడికల్ కాలేజీలు, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, దోర్నాల, బుట్టాయిగూడెంలో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా జగన్ స్వయంగా చెప్పుకు రావడం విశేషం.
అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం అని గుర్తు చేసారు. విజయవాడలో రూ.404 కోట్లతో 206 అడుగుల అంబేద్కర్ 'సామాజిక న్యాయ మహాశిల్పం' నిర్మించినట్టు తెలిపారు. కాగా మరలా ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చినట్లయితే వచ్చే 5 ఏళ్లలో... మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైన ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం అని ఈ సందర్భంగా మాటిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: