ఆ డ్రైవర్ల నెత్తిన పాలు పోసిన జగన్.. కీలక హామీతో జీవితాలు మారనున్నాయా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా మేనిఫెస్టోను విడుదల చేయగా జగన్ ఇచ్చిన కొన్ని హామీలు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల బ్రతుకుచిత్రాలను మార్చే విధంగా ఉన్నాయి. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు సైతం వైఎస్సార్ వాహనమిత్ర స్కీమ్ ను అమలు చేస్తానని జగన్ హామీ ఇవ్వడంతో పాటు లారీ, టిప్పర్ డ్రైవర్లకు 10 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కల్పిస్తానని చెప్పారు. లారీ, టిప్పర్ డ్రైవర్ల నెత్తిన పాలు పోసేలా ఈ హామీ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఆటోలు, ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి సైతం జగన్ తీపికబురు అందించారు. వీటిని కొనుగోలు చేసేవాళ్లకు వడ్డీ రాయితీ ఉంటుందని జగన్ హామీ ఇవ్వడం గమనార్హం. అదే సమయంలో వైఎస్సార్ వాహనమిత్రను ఐదేళ్లలో 50,000 రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచుతానని జగన్ పేర్కొన్నారు. స్విగ్గీ, జొమాటో లాంటి గిగా సెక్టార్ ఉద్యోగులపై సైతం ఏపీ సీఎం వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు.
 
ఈ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వీరికి వైఎస్సార్ బీమా వర్తిస్తుందని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా 2025 సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ ఇస్తామని జగన్ ప్రకటన చేశారు. గతంలో అమలు చేసిన పథకాలలో 95 శాతం హామీలను కొనసాగించడానికి జగన్ సిద్ధమయ్యారు.
 
రెండు విడతలలో పెన్షన్ పెంపును ప్రకటించిన జగన్ 2028 సంవత్సరం జనవరిలో 250 రూపాయలు పెన్షన్ పెంచుతామని 2029 సంవత్సరం జనవరిలో 250 రూపాయలు పెన్షన్ పెంచుతామని పేర్కొన్నారు. అమ్మఒడి, రైతుభరోసా స్కీమ్స్ లో ఇచ్చే నగదు మొత్తాన్ని సైతం జగన్ పెంచడం గమనార్హం. వీలైతే మేనిఫెస్టోలో పెట్టని హామీలను సైతం అమలు చేసే ప్రయత్నం చేస్తానని జగన్ హామీ ఇవ్వడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: