జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమేనా.. ?

NAGARJUNA NAKKA
మరోమారు కరోనా విజృంభిస్తోంది. దసరా తర్వాత పెరుగుతున్న కేసులే ఇందుకు ఉదారహణ. చలికాలం, ఆపై వరుస పండుగలవేళ వైరస్ ఉధృతి పెరుగుతుండటంతో.. ప్రజలు, వైద్య ఆరోగ్యశాఖలో ఆందోళన మొదలైంది. మానవ తప్పిదాల వల్లే కరోనా విజృంభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సెకెండ్ వేవ్ పై జాగ్రత్తగా ఉండాలని,  నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది సీసీఎంబీ.  వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కంటే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతోంది.
తెలంగాణలో దసరాకు ముందు మహమ్మారి తీవ్రత తగ్గినట్లే కనిపించింది. ఆ తర్వాత వైరస్‌ వ్యాప్తి మళ్లీ క్రమంగా పెరిగింది.  ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం, షాపింగ్‌లు చేయడం, రాకపోకలు ఎక్కువగా కొనసాగించడం వంటి కారణాలతో కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ  చెబుతోంది. కేరళలో ఓనం  తర్వాత కేసులు పెరిగినట్లే, ఇక్కడ కూడా కొంత పెరిగే అవకాశం ఉందని మొదటి నుంచి  అంచనా వేస్తూ వస్తోంది. దానికి తోడు చలికాలం ప్రారంభం కావడంతో వైరస్‌ విజృంభణకు అవకాశం ఉంటుంది. కరోనా తగ్గిందనే భ్రమల్లో ఉండొద్దని హెచ్చరించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్.  సెకండ్ వేవ్ మాత్రమే కాదు, మరిన్ని వేవ్‌లు రావచ్చని చెబుతున్నారు.
ప్రపంచ జనాభాలో ఇప్పటివరకు 10 శాతం మందే కరోనా బారినపడ్డారని, ఇంతకుముందు కరోనా రాని వారు సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారినపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ మొదలుకావడంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరిన్ని కరోనా 'వేవ్‌'లకూ సిద్ధంగా ఉండాలని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా  హెచ్చరించారు. మరోవైపు సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంపై వైద్యశాఖ దృష్టి సారించింది. జిల్లాలను అప్రమత్తం చేస్తోంది.  కేసులు పెరుగుతున్న జిల్లాలపై దృష్టిపెట్టామని.,  జనసమ్మర్థ ప్రాంతాల్లో విస్తృతంగా టెస్టులు చేయాలని డీఎంహెచ్‌వోలను ఆదేశించించినట్టు వివరించింది.  
 ఇక  ప్రస్తుత శీతాకాలంలో ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం.  వెలుతురు సరిగా లేని ఇలాంటి ఇళ్లలో ఒకరికి వైరస్‌ సోకినా.. మిగతావారికి వ్యాపిస్తూ కేసులు పెరిగే అవకాశం ఉంది. వచ్చే మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్‌ మొదటి వారంలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతుంటున్నారు నిపుణులు. ఏ వైరస్ అయినా రెండో సారి విజృంభిస్తే దాని ప్రభావం తీవ్రంగా వుంటుందని  హెచ్చరిస్తున్నాయి వైద్యవర్గాలు.ప్రజలు ఏ మేరకు ముందు జాగ్రత్తలు పాటించారనే విషయంపై సెకెండ్ వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుందంటున్నారు. దానికి తోడు పండుగల సీజన్ కూడా కావడంతో ప్రజల్లో ముందు జాగ్రత్తలపై నిర్లక్ష్యం ఆవహించినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.కరోనా వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రానందున ముందు జాగ్రత్తలు అత్యంత అనివార్యమంటున్నారు నిఫుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: