కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ ధృష్టి..!

NAGARJUNA NAKKA

తెలంగాణ కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధృష్టి సారించారు. రేపు ఈ విషయంపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే సచివాలయ డిజైన్లను పరిశీలించిన సీఎం కేసీఆర్... మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత టెండర్లను ఆహ్వానించనున్నారు.

 

తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలని భావిస్తున్న  సీఎం... దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. వాటిపై సమీక్షా సమావేశంలో చర్చిస్తారు. సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై రివ్యూ చేయనున్నారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. మంగళవారం జరగబోయే సమీక్షా సమావేశంలో... మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు పాల్గొననున్నారు. 

 

రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడించేలా సచివాలయం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా సచివాలయం ఉండాలని సూచించారు. పరిపాలన కేంద్రానికి ఉండాల్సిన సదుపాయాలన్నీ ఉండటంతో పాటు... సీఎం, మంత్రులు, సీఎస్‌ ఒకే దగ్గరి నుంచి విధులు నిర్వర్తించేలా సచివాలయం రూపకల్పన జరగాలని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్.


 
ఇప్పటికే పాత సచివాలయం కూల్చివేతకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో.. నూతన సచివాలయం నిర్మాణంపై స్పీడ్‌ పెంచింది తెలంగాణ ప్రభుత్వం. సెక్రటేరియట్ బాహ్య రూపం ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో... లోపల కూడా అంతే సౌకర్యవంతంగా, సకల వసతులతో ఉండాలని అంటున్నారు... సీఎం. మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు, సమావేశ మందిరాలు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్ హాల్స్, సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్, రికార్డు రూములు వగైరా.. ఎలా ఉండాలో నిర్ణయించాలంటూ అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. సెక్రటేరియట్ ప్రాంగణంలోనే ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్, విజిటర్స్ రూమ్, పార్కింగ్, భద్రతా సిబ్బంది నిలయాల కోసం తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: