అన్ లాక్ 2.0 : నగరాల్లో రోగుల పరిస్థితి అంత దారుణమా.... లక్షలుంటేనే వైద్యం....?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను మరింత పెంచుతున్నాయి. మొదట్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు మాత్రమే అనుమతులు ఇచ్చేవి. అయితే కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. 
 
దీంతో కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా ఉన్నా లేకున్నా రోగి 5 లక్షల రూపాయలు చెల్లిస్తే మాత్రమే ఆస్పత్రుల్లో బెడ్ ఇస్తామని చెబుతున్నాయి. బీమా పాలసీలు ఉన్నాయని చెబుతున్నా నగదు ముందుగా చెల్లిస్తే మాత్రమే బెడ్ కేటాయిస్తామని షరతులు విధిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 
 
ఇన్సూరెన్స్‌లను అనధికారికంగా నిషేధించిన కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పరీక్ష నిర్వహిస్తే నెగిటివ్ అని తేలింది. అయినా విపరీతమైన ఆయాసం ఉండటంతో స్నేహితుల సహాయంతో సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. 5 లక్షలు చెల్లిస్తే మాత్రమే బెడ్ ఇస్తామని.... ఇన్సూరెన్స్‌ను పరిగణనలోకి తీసుకోమని చెప్పి చివరకు అప్పటికప్పుడు మూడు లక్షలు చెల్లిస్తే బెడ్ ఇస్తామనే షరతుపై ఆయనను చేర్చుకున్నాయి. 
 
మరికొన్ని ఆస్పత్రుల్లో బిల్లు కావాలంటే రశీదులో ఒక రేటు వేస్తామని బిల్లు వద్దనుకుంటే మరో రేటు వేస్తామని చెబుతున్నాయి. డబ్బు ఉంటే రోగిని ఆస్పత్రిలో చేర్చండి లేకపోతే లేదని ఆస్పత్రులు స్పష్టం చేస్తూ రోగులు, రోగి బంధువులకు చుక్కలు చూపిస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇన్సూరెన్స్‌ను అంగీకరిస్తే బీమా కంపెనీల ఆడిట్‌తో తమ గుట్టు రట్టవుతుందనే భయం వాళ్లలో ఉంది. అందువల్లే కార్పొరేట్ ఆస్పత్రులు బీమాలను తిరస్కరిస్తూ నుంచి అందినకాడికి దోచుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: