హెరాల్డ్ విజేత: అక్షరాన్ని ఆధునికీకరించిన రామోజీరావు..!

Chakravarthi Kalyan
రామోజీరావు.. ఈ పేరు తెలియని తెలుగువారు చాలా అరుదు.. ఓ మారుమూల పల్లెటూరు నుంచి ఓ పేద కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారారు. ఆయన ఎంత సంపాదించారన్నది అసలు ప్రశ్నే కాదు. కానీ ఆయన విజేతగా మారిన తీరు మాత్రం ఓ వ్యక్తిత్వ వికాస పుస్తకమే. ఒక మనిషి పట్టుదలగా శ్రమిస్తే ఎన్ని విజయాలు అందుకోవచ్చో నిరూపించిన విజేత రామోజీరావు.

రామోజీరావు పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది ఈనాడు. కానీ ఆయన కేవలం ఈనాడు మాత్రమే కాదు.. అనేక సంస్థలను విజయవంతంగా ఏకకాలంలో నడిపించిన నాయకుడు. ఆయన వ్యాపార సంస్థల జాబితా చూస్తే.. కొడవీటి చాంతాడంత ఉంటుంది. అయితే ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా.. ఆయన ప్రాణం గుండెకాయ మాత్రం ఈనాడే. దినపత్రిక అంటే ఉదయమే పాఠకుడి ముంగిట ఉండాలన్న ఆయన కోరికే ఈనాడుగా సాక్షాత్కరించింది.

1974లో రామోజీరావు ఈనాడును స్థాపించారు. నవతరం ఆలోచనలతో ఉరకలెత్తిన ఈనాడు.. స్థాపించిన అనతి కాలంలోనే అప్పటి వరకూ ఉన్న పత్రికలను వెనక్కి నెట్టేసింది. The largest circulated telugu daily ట్యాగ్ లైన్ సంపాదించుకుంది. ఇక అప్పటి నుంటి ఈనాడు తెలుగు వారి జీవితంలో ఓ భాగమైపోయింది. జర్నలిజంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ ఎప్పటికప్పుడు నిత్యనూతంగా తనను తాను ఆవిష్కరించుకుంటూ ఈనాడు నిత్యం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది.

రామోజీరావు అంటే ఈనాడు ఒక్కటే కాదు.. ఈటీవీ, ఈటీవీ న్యూస్, ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్‌ సిటీగా రూపుదిద్దుకుని గిన్నిస్ బుక్‌ లో చోటు సంపాదించుకున్న రామోజీ ఫిలింసిటీ, చిట్ ఫండ్ వ్యాపారం మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, కళాంజలి, అన్నదాత.. ఇలా ఎన్నో.. ఆయన ఎన్నిస్థాపించినా నమ్మే సూత్రం ఒక్కటే.. నాణ్యత, నవ్యత. తనకు కూడా ప్రత్యామ్నాయం చూపగలిగేవాడే నిజమైన నాయకుడు అన్నది ఆయన నమ్మే సూత్రం. పనిలోనే విశ్రాంతి అన్నది ఆయన ట్యాగ్ లైన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: