హెరాల్డ్ విజేత : అపర చాణిక్యుడు చంద్రబాబు పొలిటికల్ కెరీర్ సక్సెస్ స్టోరీ...?

Reddy P Rajasekhar

నారా చంద్రబాబు నాయుడు... దేశంలోని రాజకీయ నాయకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. 1950 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరు జిల్లా నారావారిపల్లె గ్రామంలో సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కోసం పొరుగు గ్రామమైన శేషాపురంకు ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లేవారు. అనంతరం చంద్రగిరి లోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి 9వ తరగతి వరకు చదివిన చంద్రబాబు తిరుపతిలో పదవ తరగతి చదివారు. 
 
అనంతరం ఎస్వీ యూనివర్సిటీలో బీ.ఏ. తరువాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ప్రజాసేవపై ఆసక్తి ఉన్న చంద్రబాబు ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని భావించి విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 
 
అనంతరం కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖల్లో ఆయన మంత్రిగా పని చేశారు. 1981, సెప్టెంబర్ 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని చంద్రబాబు వివాహమాడారు. కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటన చేసి ఆందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం టీడీపీలో చేరాడు. 
 
అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పొందారు. 1989లో టీడీపీ ఓడిపోయిన సమయంలో, ప్రతిపక్ష హోదాతో శాసన సభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో, చంద్రబాబు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. 1995 సంవత్సరంలో తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. . అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి చవిచూసిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు. 2019లో టీడీపీ ఓటమిపాలైనా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీలను సృష్టించుకుని విజేతగా నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: