బెల్టుషాపులను అందుకే బంద్ చేయించాను.... అసలు నిజం చెప్పేసిన సీఎం జగన్...!

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బెల్టుషాపులను పూర్తిగా మూసివేయడం వెనుక బలమైన కారణం ఉందని చెప్పారు. ఈ నిర్ణయం వెనుక దూర దృష్టి ఉందని అన్నారు. రాష్ట్రంలోని మహిళా పోలీసులు బెల్టు షాపులు నడవకుండా చూసుకోవాలని సూచించారు. ఈరోజు జగన్ క్యాంపు కార్యాలయంలో మద్యం అక్రమ తయారీ, బెల్టుషాపుల రద్దు, ఇసుక అక్రమ రవాణా, అక్రమ అమ్మకాల గురించి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ప్రొహిబిషన్‌–ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం గ్రామాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. సీఎం రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, వైయస్సార్ విలేజ్ క్లినిక్ లు, వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయం, ఇతర మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. 
 
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, బెల్టు షాపులు, అక్రమ మద్యం తయారీ లాంటివి కొనసాగకుండా తగిన చర్యలు చేపట్టాలని అలాంటివి ప్రభుత్వ లక్ష్యాలను దెబ్బ తీసే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో అక్రమ మద్యం రవాణా, అక్రమ ఇసుక రవాణాపై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తే అక్రమ రవాణా జరగదని చెప్పారు. 
 
గ్రామాల్లో 11,000 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వ ప్రతిష్ట గ్రామాల్లో పెరగాలంటే బెల్టుషాపులు నడవకుండా చూడాలని... మహిళా పోలీసుల సహకారంతో బెల్టుషాపులు ఉండకుండా చేయాలని చెప్పారు. అధికారులకు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనులకోసం మూడింట రెండు వంతుల సిబ్బందిని ఉపయోగించాలని చెప్పారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ఇప్పటికే మద్యం షాపులను తగ్గించిన జగన్ రాష్ఱంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: