నల్గొండ జిల్లాలో రచ్చ రచ్చ... కొట్టుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...!

Reddy P Rajasekhar

ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరస్పర దూషణలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం కొట్టుకునేంతవరకు వెళ్లింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని భూపాల్ రెడ్డిని ప్రశ్నించడంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం మొదలైంది. 
 
గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.భూపాల్ రెడ్డి ఆ ప్రశ్నకు సమాధానంగా కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నామని నిధులు విడుదలవుతున్నప్పటికీ కళ్లు కనిపించడం లేదా అని సమాధానం ఇవ్వడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. ఎమ్మెల్యేలు ఇద్దరూ దూరం నుండి ఒకరి దగ్గరకు మరొకరు వచ్చి చేతులు విదిలించుకోవడం గమనార్హం. ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యేల అనుచరులు కూడా ప్రత్యర్థులపై కొట్లాటకు దిగారు. 
 
ఒకరిపై ఒకరు చేతులు ఎత్తే సమయంలో పోలీసుల రాకతో వివాదం సద్దుమణిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి వారి ఎమ్మెల్యేలకు మద్దతుగా భారీ స్థాయిలో నినాదాలు చేశారు. ఒక పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. పోలీసులు ఇద్దరు నేతలను వెనక్కు రప్పించటంతో అక్కడ పరిస్థితులు చక్కపడ్డాయి. 
 
ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవతో బీట్ మార్కెట్ పంచాయతీ రాజ్ సమ్మేళనం అంతా రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకోకపోయి ఉంటే మాత్రం ఇద్దరు నేతల మధ్య, వారి అనుచరుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగి ఉండేది. ఎమ్మెల్యే హోదాల్లో ఉన్న వ్యక్తులు స్టేజీపై గొడవలకు దిగడం పట్ల ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: