మేడారం జాతరలో కుండపోత వర్షం... ఇద్దరు మహిళలు మృతి... !
మేడారంలో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి భక్తులు తడిసి ముద్దవుతున్నారు. వర్షాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా వర్షంలోనే అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నేటితో మేడారం జాతర ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మలు కొంతసేపటి క్రితం వనప్రవేశం చేశారు. భక్తులు వర్షంలో తడుస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు.
భారీగా కురుస్తున్న కుండపొత వర్షం కారణంగా ఇద్దరు మహిళలు మేడారంలో మృతి చెందారు. భారీ వర్షానికి చెట్టు కూలి ఒక మహిళ మృతి చెందగా జంపన్న వాగు దగ్గర విద్యుత్ షాక్ తగిలి మరో మహిళ మృతి చెందింది. మహిళలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈరోజు మేడారం జాతరకు పలువురు ప్రముఖులు విచ్చేసి వన దేవలను దర్శించుకున్నారు. మేడారం జాతరకు ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి అర్జున్ ముండా వచ్చారు. అమ్మవార్లను దర్శించుకొని అర్జున్ ముండా మొక్కులను చెల్లించారు. అర్జున్ ముండా మీడియాతో మాట్లాడుతూ జాతీయ పండుగగా మేడారం జాతరను గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరతానని చెప్పారు.
గిరిజనులు మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరుకుంటున్నారని గిరిజనుల కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నానని అర్జున్ ముండా చెప్పారు. జాతీయ పండుగ అంశం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విన్నవించిందని అర్జున్ ముండా అన్నారు. అర్జున్ ముండాతో పాటు మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 12 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చినట్టు చెప్పారు. మేడారం జాతరకు అధికారుల అంచనాలను మించి భక్తులు హాజరయ్యారు. దాదాపు కోటీ 50 లక్షల మంది భక్తులు హాజరయ్యారని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రముఖులు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.