కేబినేట్ భేటీలో అమరావతిపై తేల్చి చెప్పిన సీఎం జగన్...!

Reddy P Rajasekhar

గత కొన్ని రోజులుగా ఏపీ రాజధాని విషయంలో గందరగోళం నెలకొంది. సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని చెప్పిన రోజు నుండి రాజధానిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా సీఎం జగన్ చేసిన ప్రకటనకు అనుకూలంగానే ఉండటం గమనార్హం. ఇలాంటి సమయంలో ఈరోజు కేబినేట్ భేటీ తరువాత రాజధాని గురించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. 
 
కానీ ఎవరూ ఊహించని విధంగా రాజధాని విషయంలో నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సీఎం జగన్ ఈరోజు జరిగిన సమావేశంలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. లక్ష కోట్ల రూపాయలలో పది శాతం విశాఖలో ఖర్చు పెడితే విశాఖ అభివృద్ధి అవుతుందని సీఎం చెపినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ రాజధాని తరలింపు గురించి తొందరపాటు లేదని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. 
 
సీఎం జగన్ కేబినేట్ భేటీలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాజధాని మార్పు ఖాయంగానే కనిపిస్తోంది. సీఎం జగన్ మంత్రులతో రాజధానిని ఎందుకు మారుస్తున్నామో, రాజధాని మార్పు అవసరం ఏమిటో ప్రజలకు చెప్పి రాజధాని విషయంలో నిర్ణయం ప్రకటిద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపు విషయంలో ఎటువంటి తొందరపాటు అవసరం లేదని జగన్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 
 
సీఎం జగన్ న్యాయపరంగా చిక్కులు రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తరువాత సీఎం జగన్ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రాజధాని గురించి కీలక ప్రకటన చేయనున్నారు. మరోవైపు బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ తరువాత హై పవర్ కమిటీ నివేదిక కూడా తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటిస్తుందని పేర్ని నాని అన్నారు.  2020 సంక్రాంతి సెలవుల తరువాత జగన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: