చక్రం తిప్పిన శరద్ పవార్.. బిజెపి పరువంతా పోయింది

Vijaya
భారతీయ జనతా పార్టీ రెండోసారి పరువు పోగొట్టుకుంది. బలపరీక్షకు 24 గంటల ముందే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజానామా చేసేశారు. ఎప్పుడైతే డిప్యుటి సిఎంగా అజిత్ పవార్ రాజీనామా చేశారో అప్పుడు ఫడ్నవీస్ రాజీనామా కూడా ఖాయమైపోయింది. మొత్తం మీద బిజెపి పరువు పోగొట్టుకుందనే చెప్పాలి. లేనిబలం ఉందని చెప్పి కర్నాటకలో మొదటిసారి ఫెయిలైతే ఇపుడు అదే డ్రామా ఆడి మహారాష్ట్రలో కూడా పరువు పోగొట్టుకుంది.

ఈ మొత్తం మీద ఎన్సీపి అధ్యక్షుడు శరవ్ పవార్ చక్రం తిప్పిన విషయం అర్ధమైపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉండి, నరేంద్రమోడి, అమిత్ షాలు పూర్తి మద్దతుగా నిలబడినా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఏమీ చేయలేకపోయారు. శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ నుండి ఎంఎల్ఏలను చీల్చటానికి చాలా ప్రయత్నాలే చేశారు. అయితే వాళ్ళ పాచికలు ఏవీ పారకపోవటంతో వేరే గత్యంతరం లేకే సిఎంగా రాజీనామా చేశారు.

మొత్తానికి సుమారు 30 రోజులుగా బిజెపి ఆడిన అన్నీ డ్రామాలకు ఫులిస్టాప్ పడింది. ఇక మొదల్లవాల్సింది మూడు పార్టీల డ్రామానే. మరి బలపరీక్షకు ముందే ఫడ్నవీస్ రాజీనామా చేయటంతో గవర్నర్ కోషియారీ ఏం చేస్తారో చూడాల్సిందే. ఎందుకంటే మూడు పార్టీలకు అవసరమైన 145 ఎంఎల్ఏల మ్యాజిక్ ఫిగర్ ఉందా లేదా అన్నది చూడాల్సిందే.

ఒకవేళ ప్రస్తుతానికి మ్యాజిక్ ఫిగర్ ను కాపాడుకున్నా వీళ్ళ ప్రభుత్వమైతే ఎన్నో రోజులు కంటిన్యు అయ్యే అవకాశాలు లేవనే అనుకోవాలి. ఎలాగంటే కర్నాటకలో యడ్యూరప్ప కూడా ఇలాగే బలపరీక్షలో నెగ్గే అవకాశం లేదని తెలిసి రాజీనామా చేశారు. అప్పటి నుండి జనతాదళ్+కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏనాడూ ప్రశాంతంగా పనిచేసుకోనీయలేదు. రెండు పార్టీల నుండి ఎంఎల్ఏలను ప్రలోభాలు పెట్టి చీలిక తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టారు. అదే పద్దతి మహారాష్ట్రలో కూడా బిజెపి అనుసరించే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దానికి ఎన్నిరోజులు పడుతుందనేది మూడు పార్టీలు ఏర్పాటు చేసుకునే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ మీద ఆధారపడుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: