మహారాష్ట్రలో ఎన్సీపీనే కింగ్ మేకరా ? బిజెెపి-పవార్ పొత్తు ?
క్షేత్రస్ధాయిలో
పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసిన
నాలుగు రోజుల తర్వాత కూడా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాలేదు.
ముఖ్యమంత్రి పీఠంపై మిత్రపక్షాలు బిజెపి-శివసేన మధ్య మొదలైన పేచి వల్లే ప్రభుత్వం
ఏర్పాటు కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి
పదవిని అందుకనే విషయంలో బిజెపి-శివసేనలు ఎవరికి వారే పట్టుదలకు పోవటంతో సమస్య
పెద్దదైపోయింది. దాంతో రెండు పార్టీలు ఇపుడు ఎన్సీపీ వైపు చూస్తున్నాయి.
తాజా రాజకీయ సంక్షోభాన్ని గమనిస్తే ఎన్సీపీనే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 288 అసెంబ్లీ స్ధానాలున్న మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపికి 105 మిత్రపక్షం శివసేనకు 56 సీట్లు వచ్చాయి. అలాగే ప్రత్యర్ధి మిత్రపక్షమైన కాంగ్రెస్ కు 44 సీట్లు వస్తే ఎన్సీపికి 54 సీట్లొచ్చాయి. మిగిలిన సీట్లలో ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు.
బిజెపి-శివసేనలో తాజా వివాదం వల్ల చివరకు రెండు పార్టీలు కూడా ఎన్సీపి వైపు చూస్తున్నాయి. అయితే బిజెపి-ఎన్సీపి కలిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 288 సీట్లలో సగం అంటే 149 సీట్ల బలముండాలి. సిఎం పదవి విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన వల్ల బిజెపి, శివసేనకు 161 ఎంఎల్ఏల బలమున్నా ఉపయోగం లేకపోతోంది.
ఇదే అదునుగా శివసేనను వదిలిపెట్టి ఎన్సీపితో పొత్తు పెట్టుకుంటే ఎలాగుంటుందని బిజెపి సీనియర్ నేతలు శరద్ పవార్ తో మంతనాలు మొదలుపెట్టేశారట. పవార్ కూతురు సుప్రియాసూలేతో బిజెపి నేతలు టచ్ లోకి వెళ్ళారన్నది తాజా కబురు. ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం పవార్ పై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో దాడులు చేయించి కేసులు పెట్టింది. ఎన్నికల తర్వాత అవసరార్ధం ఇదే బిజెపి పవార్ తో కాళ్ళబేరానికి వెళుతోంది. మరి జరుగుతున్న పరిణామాల విషయంలో పవార్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.