వైసిపికి సినీ గ్లామర్ - త్వరలో సూపర్ హీరోయిన్ ఎంట్రీ!

అటు ఉత్తరాది ఇటు దక్షిణాదిన అందాల తార గానే కాదు అత్యుత్తమ నటిగా విరాజిల్లిన జయప్రధ రాజకీయాల్లొనూ అలాగే పరిమళించింది. అయితే ఆమె ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సన్నా హలు చేసుకొంటున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ విషయమై ఈ మాజీ పార్లమెంట్ సభ్యురాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం నుంచి బయట పడిన తర్వాత జయప్రద తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నట్లు సమాచారం. 



తెలుగు, హిందీ సినీ రంగంలో, రాజకీయ రంగంలోను జయప్రద గతంలో ఒక వెలుగు వెలిగారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ పిలుపుతో జయప్రద 1994 టిడిపిలో చేరారు. టీడీపీ సంక్షోభం తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయప్రదకు టిడిపి తరపున 1996లో రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం దక్కింది.



తెలుగుదేశంలో కొంత కాలం కొనసాగిన తర్వాత జయప్రద తన స్నేహితుడు అమర్‌సింగ్ ద్వారా సమాజ్ వాదీ పార్టీలో చేరి యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆమె చాలా కాలం పాటు సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు.

యూపీ శాసనసభ ఎన్నికల సమయంలో ఎస్పీలో చోటు చేసుకొన్న సంక్షోభ సమయంలో అమర్‌ సింగ్ ను అప్పటి ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీ నుండి సస్పెండ్ చేయటంతో జయప్రద కూడ ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. 

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో జయప్రద, తనకు ఇబ్బందులు రావడంతో ఏపీ రాజకీయాల వైపు  దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది. ఇక్కడ జనసేన, వైసీపీల్లో ఏ పార్టీలో చేరాలనే విషయమై జయప్రద ఇంకా ఆలోచిస్తున్నట్టు సమాచారం ఉంటూ వస్తుంది. చివరకు వైసీపీలో జయప్రద చేరాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మక రాజమహెంద్రవరం నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆమె సన్నాహలు చేసుకొంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ స్థానం నుండి సినీనటుడు మురళీ మోహన్ టీడీపీ ఎంపీగా కొనసాగుతున్నారు.  

రాజమహెంద్రవరం నుండి వైసీపీ అభ్యర్ధిగా జయప్రద పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అయితే జయప్రద ఏ పార్టీలో చేరుతారు, ఎప్పుడు ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడతారోననే విషయమై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. లోక్‌సభ సీటు లేదా రాజ్యసభ సీటు కావాలని జయప్రద ఆశిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లోగాని వైసిపిలోగానే చేరే విషయమై  జయప్రద ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: