కేటీఆర్, జగన్, లోకేశ్.. ఈ ముగ్గురికీ గోల్డెన్ ఛాన్స్..?

Chakravarthi Kalyan

ముఖ్యమంత్రి.. రాజకీయ నాయకుడైన ప్రతి ఒక‌్కరి కల. కానీ ఈ కల నెరవేరేది అతి తక్కువ మందికే. అందులోనూ రాజకీయాల్లో ఆరి తేరి.. ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న తర్వాత కానీ ఈ పదవి చేతికి అందదు. సాధారణంగా ఓ పార్టీలో చేరి ముఖ్యమంత్రి వరకూ ఎదగాలంటే కనీసం 60 ఏళ్లు దాటితే కానీ సాధారణంగా ఆ అవకాశం రాదు. కానీ వారసత్వ రాజకీయాల పుణ్యమా అని కొందరికి చిన్న వయస్సులోనే సీఎం అయ్యే ఛాన్సులున్నాయి.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ వయస్సులోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ముగ్గురికి కనిపిస్తోంది. వారిలో ముందు వరసలో ఉన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని బలంగా భావిస్తుండటంతో రాష్ట్రంలో కేటీఆర్‌ను సీఎం చేసే అవకాశం ఉందని ఎన్నికలకు ముందు నుంచే విశ్లేషణలున్నాయి. ఇప్పుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా కావడంతో కేటీఆర్ సీఎం అయ్యే ఛాన్సు చాలా ఎక్కువగా ఉంది.



ఇక మరో వ్యక్తి వై.ఎస్. జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్.. గత ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని కొద్ది తేడాతో కోల్పోయాడు. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని పట్టుదలగా ఉన్నాడు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే.. ఈసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. గత ఎన్నికల్లో చేసిన తప్పులు రిపీట్ కాకుండా చూసుకుని జాగ్రత్తపడితే సీఎం అయ్యే అవకాశాలు జగన్‌కు బాగానే ఉన్నాయి.



ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ కు కూడా సీఎం అయ్యే ఛాన్సులు ఫిప్టీ ఫిఫ్టీగా ఉన్నాయి. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే లోకేశ్ సీఎం కావడం అతి త్వరలోనే జరగొచ్చు. విభజనతో అతలాకుతలమైన ఏపీని చంద్రబాబు మాత్రమే ప్రగతి పథంలో పయనింపజేస్తాడని జనం భావిస్తే మరోసారి టీడీపీ జెండా ఎగురుతుంది. అప్పుడు లోకేశ్‌కు సీఎం అయ్యే ఛాన్సులు పెరుగుతాయి. ఏదేమైనా పై ముగ్గురిలో ఇద్దరిని త్వరలోనే ముఖ్యమంత్రులుగా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: