చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం

ఎమార్వో వనజాక్షిని దూషించి ఆమెపై దాడికి పాల్పడ్ద ఎమెల్యే అంటే త్వరగా జనానికి అర్ధమయ్యే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అధికార తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ విఫ్ చింతమనేని ప్రభాకర్‌పై ఎన్నాళ్ళో వేచిన హృదయం అన్నట్లుగా దుర్మార్గానికి పరాకాష్ట అన్నట్లుగా ఇన్నాళ్ళకు ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో, ఆయనతో పాటు ఆయన అనుయాయులు నేతల రవి, చుక్కా వెంకటేశ్వరరావుతో పాటు  ముగ్గురు గన్‌-మెన్‌ లపైనా కేసు నమోదైంది. దెందులూరు టిడిపి ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యానికి పాల్పడితే ఆయనపై కేసు పెట్టడానికి అన్ని రాజకీయ పక్షాలు ఇంత కష్టపడాలా? చివరికి ఒత్తిడికి లొంగి పోలీసులు కేసు పెట్టక తప్పలేదట.


ఏలూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఐఎంఎల్‌ డిపో హమాలీ మేస్త్రి రాచీటి జాన్‌ ను, ఎమ్మెల్యే ప్రభాకర్‌ తన ఇంటికి పిలిపించుకుని కొట్టి, కులంపేరుతో దూషించిన ఘటనపై కార్మిక, దళిత సంఘాలు, వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటంతో చేసేది లేక పోలీస్‌ అధికారులు కేసు నమోదు చేశారు.


చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.  ఐఎంఎల్‌ డిపోలో ఒక హమాలీ సక్రమంగా పనిచేయక పోవటంతో ‘హమాలీ మేస్త్రి రాచీటి జాన్‌’ అతడిని పనిలో నుంచి తొలగించాడు. ఈ విషయం పై ఎమ్మెల్యే చింతమనేని మేస్త్రి జాన్‌ ను ఇంటికి పిలిపించి పంచాయితీ పెట్టారు. తొలగించిన కార్మికుడిని తిరిగి పనిలో పెట్టుకోవాలని హుకుం జారీ చేశారు. తమ కార్మిక సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అతడిని పనిలో పెట్టు కోవటం కుదరదని జాన్‌ చెప్పటంతో, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై చింతమనేని దాడికి పాల్పడ్డారు. కొట్టటంతోపాటు, కులం పేరుతో దూషించారు.



ఈ విషయంపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈనెల 10న సంఘటన జరగగా 11న కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు, బాధితుడు జాన్‌ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు ఈనెల 14 వరకూ పోలీసులు కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. కేసు నమోదు చేయకపోవటంపై వామపక్ష పార్టీలు, కార్మిక, దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలన్నీ అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని చేపట్టాయి. చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల ని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం త్రీటౌన్‌ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐపీసీ 323 కింద కేసు నమోదు చేశారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: