ప్రధానికి తమిళ తంబీల షాక్..!

Edari Rama Krishna
డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి నిరసనలతో స్వాగతం లభించింది.  మహాబలిపురంలో డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానికి నిరసనల స్వాగతం ఎదురైంది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో నిరసనకారులు నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.  కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

మోదీని అడ్డుకుంటామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.  కావేరీ జలాలపై ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రధాని వచ్చే సమయానికి నల్ల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. పెద్ద సంఖ్యలో బెలూన్లను వదలడంతో ఏం జరుగుతుందోన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. దర్శకుడు భారతీరాజా సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మరోవైపు నిరసనల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

డీఎంకే, ఎండీఎంకే, ఇతర తమిళ సంఘాల నిరసనలతో ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్‌పీజీకి అదనంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని సీనియర్‌ పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్, త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్న రజనీకాంత్ కూడా కావేరీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.

కేంద్రం దిగిరావాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం అమలు చేయడంలేదని మండిపడ్డారు. కావేరి నిరసనల కారణంగా భద్రత ప్రశ్నార్థకం కావడంతో ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా చెన్నై నుంచి తరలించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: