నేను అక్కడే చనిపోతానని ప్రచారం చేశారు : సీఎం కేసీఆర్

siri Madhukar
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.  నిన్న అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ సెట్ పోడియం వైపు విసిరివేయడంతో అది స్వామిగౌడ్ కి తాకడం..ఆయన సరోజిని ఆస్పత్రిలో చేరడం జరిగింది.  దీనిపై నేడు చర్యలు తీసుకుంటూ..కాంగ్రెస్ సభ్యులను 11 మందిని సస్పెండ్ చేశారు. ఇక కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాన్ని రద్దు చేశారు. 

ఈ అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఐదు రోజులకే కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన దిష్టిబొమ్మలను దహనం చేశారని, ప్రధానిని కలవడానికి తాను వెళ్తే దుష్ప్రచారం చేశారని అసెంబ్లీలో కేసీఆర్ గుర్తు చేశారు. 

మరో దారుణమైన విషయం ఏంటంటే.. ‘‘నాకు ఏదో జబ్బు వచ్చినట్టు.. అందుకే అమెరికాకు పోతున్నట్టు.. కేసీఆర్ అక్కడే చచ్చిపోతాడన్నట్టు నాలుగు సంవత్సరాలుగా నాపై విషపూరిత ప్రచారం చేస్తున్నారు. ఇన్నేళ్లా?.. వినడానికే బాధనిపిస్తోంది అధ్యక్షా!’’ అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.నాలుగేళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శాంతిభద్రలకు ఢోకా లేదని, అది ఓర్వలేకనే కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని కేసీఆర్ విమర్శించారు.

అరాచక శక్తుల పీచమణచడంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, వెనకడుగు వేయబోదని హెచ్చరించారు. హెడ్‌సెట్‌ తగిలి మండలి ఛైర్మన్‌ కన్నుకు గాయమైతే దాన్ని నాటకమని కాంగ్రెస్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు కేసీఆర్.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: