30 రేప్స్..15 మర్డర్స్.. 2 ఎస్కేప్స్...సైకో శంకర్ ఆత్మహత్య..!

Edari Rama Krishna
కరుడుగట్టిన నేరగాడు, మహిళలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడ్డ సైకో శంకర్ (41) కథ ముగిసింది. బెంగళూరు శివార్లలో పరప్పన అగ్రహార జైలులో ఖైదీగా ఉన్న అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో ఇతడు 30 మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. 15 మందిని హత్య చేశాడు. బెంగళూరులోని శివారుప్రాంతంలో ఉన్న పారప్పన్న అగ్రహార జైల్లో మంగళవారం ఉదయం సేవింగ్ బ్లేడ్‌తో గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శంకర్ ను విక్టోరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తేల్చారు.

అప్పట్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కునుకు లేకుండా గడగడలాడించిన సీరియల్ రేపిస్ట్ అసలు పేరు జైశంకర్. సేలం జిల్లాలోని ఎడపడి, కండంపట్టి ఎం శంకర్ అలియాస్ జయశంకర్‌ స్వస్థలం. ఇంటర్ చదివిన శంకర్ ట్రక్కు డ్రైవర్‌గా జీవనం కొనసాగించాడు.  జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇతడు గతంలో రెండు సార్లు తప్పించుకుపోయాడు. సినిమాల్లో సీన్లను తలపిస్తూ వెదురు బొంగు, బెడ్ షీటు సాయంతో ఎత్తైన గోడల పై నుంచి దూకి పారిపోయాడు. తిరిగి పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

తమిళ్, కన్నడ, హిందీ మూడు భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. . శంకర్ ఆత్మహత్యకు గల కారణాలపై జైలు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఖైదీలకు బార్బర్ సేవింగ్ చేసే సమయంలో బ్లేడ్‌ను దొంగిలించి ఉండవచ్చునని, అతడు బ్లేడ్‌తో గొంతు కోసుకొంటుండగా ఎవరూ చూడలేదని జైలు అధికారులు పేర్కొన్నారు.

కరడు గట్టిన సైకో శంకర్ నేర చరిత్ర :
-2009, జులై 3న హోసూర్ సమీపంలో పి. శ్యామల(45) అనే మహిళపై అత్యాచారం చేసి హత్య చేశాడు.
-2009, ఆగస్టు 23న ఎం. జయమణి అనే మహిళా కానిస్టేబుల్‌ను అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. 
-2009, అక్టోబర్ 19న జైశంకర్‌ను తిర్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. 
-2009 నుంచి 2011 మధ్య కాలంలో 13 మంది మహిళలను అత్యాచారం చేసి మట్టుబెట్టాడు. 13 మంది అత్యాచారం, హత్య కేసులతో పాటు ఏడు మర్డర్ కేసులు నమోదు అయ్యాయి. 
-2011, మార్చి 18న సేలం బస్టాండ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. 
-2011, మే 4న కర్ణాటక పోలీసులు.. జైశంకర్‌ను అరెస్టు చేశారు. మార్చి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలోనే ఆరుగురు మహిళలపై అత్యాచారం చేసి చంపేశాడు. 
-2013, ఏప్రిల్ 29న హోసూరులోని సబ్ కోర్టు.. పదేళ్ల జైలు శిక్ష విధించింది.
-2013, సెప్టెంబర్ 1న జైలు నుంచి తప్పించుకున్నాడు.
-2013, సెప్టెంబర్ 6న బెంగళూరు పోలీసులు మళ్లీ శంకర్‌ను అరెస్టు చేశారు.
-అప్పట్నుంచి బెంగళూరుకు సమీపంలోని పరప్పన అగ్రహార జైలులోనే ఉంటున్నారు.
-2018, ఫిబ్రవరి 27న జైశంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: