నిజంగా.. ఇలాంటి నాయకుడు మళ్లీ పుడతాడా..!?

Chakravarthi Kalyan
రాజకీయ నాయకుడు అంటే.. నిలువెత్తు స్వార్థం, కుట్రలు, కుతంత్రాలకు మారుపేరుగా నిలిచిన రోజులివి.. పార్టీల గెలుపు కోసం నానా గడ్డీ కరవడానికి సిద్ధపడే దుస్థితి. కానీ ఓ నాయకుడు నిజంగా ప్రజాసేవ కోసం తపిస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే జీవితమే కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్యగారిది. శుక్రవారం ఆయన వర్థంతి సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ సదస్సు జరిగింది. 



అందులో పుచ్చలపల్లి సుందరయ్య జీవితం గురించి సీపీఎం నేత బీవీ రాఘవులు చెప్పిన కొన్ని విషయాలు ఆశ్చర్యపరిచాయి. పుచ్చల పల్లి సుందరయ్య నెల్లూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చాడు. ఆ ఊళ్లో ఆరోగ్య సదుపాయాలు లేవట. ప్రత్యేకించి ప్రసూతి సౌకర్యాలు లేక మహిళలు ప్రసవ వేదనతో కన్నుమూసేవారట. 



ఈ పరిస్థితి గమనించి చలించిపోయిన పుచ్చలపల్లి సుందరయ్య స్వయంగా మంత్రసానితనం నేర్చుకున్నాడట. తానే స్వయంగా ఎందరో మహిళలకు మంత్రిసానితనం చేశాడట. చివరకు సుందరయ్య హస్తవాసి మంచిది. ఆయన చేత్తో పురుడు పోసుకుంటే తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారన్న పేరు తెచ్చుకున్నారట. స్వయంగా భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా సుందరయ్య ఆలోచనంతా నిత్యం పేదలు, బడుగు బలహీన వర్గాల గురించే. 



ఓసారి పుచ్చలపల్లి సుందరయ్యగారింట్లో పెళ్లి జరుగుతోందట. అట్టహాసంగా విందుభోజనం సిద్ధం చేశారట. సుందరయ్య గ్రామంలోని దళితులను కూడా భోజనానికి పిలవాలని కోరారట. ఇంట్లోవారు అందుకు ఒప్పుకోలేదట. దాంతో ఆగ్రహించిన సుందరయ్య దళితులు తినని ఆహారం ఇంకెవరూ తినాల్సిన అవసరం లేదంటూ ఆ మొత్తం భోజనంలో విషం కలిపేశారట. 



గ్రామ పెద్దలను ఎదిరించి దళితులు ఆ గ్రామ బావి నుంచి నీళ్లు తీసుకునే సౌకర్యం సుందరయ్యే కల్పించారట. కిరాణా దుకాణాల్లో దళితుల పట్ల చూపే అంటరానితనం సహించలకే తానే స్వయంగా దళితవాడల్లో కిరాణా దుకాణం నిర్వహించారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉదాహరణలో నిజంగా జనం కోసం తపించిన ఇలాంటి నాయకులు ఉంటారా.. ఇలాంటి మహానుభావులు మళ్లీ పుడతారా..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: