సచివాలయ ఉద్యోగుల యూనిఫామ్ గొడవ..

Deekshitha Reddy
ఆమధ్య సచివాలయాల ఉద్యోగులకు యూనిఫామ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా చోట్ల సిబ్బందికి యూనిఫామ్ క్లాత్ అందించింది. వారే కుట్టించుకోవాలని చెప్పింది. కుట్టుకూలీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతానికయితే ఇంకా ఎక్కడా సచివాలయాల స్టాఫ్ యూనిఫామ్ లో వస్తున్న దాఖలాలు లేవు. దీనిపై ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవడంలేదు. కానీ డెడ్ లైన్ పెట్టి, అప్పటి నుంచి యూనిఫామ్ వేసుకు రావాలని ఇంటర్నల్ గా ఆదేశాలు వెళ్లాయట. దీనిపై ఇప్పుడు గొడవ జరుగుతోంది.
సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్ వేసుకుంటామంటూనే.. మాకే ఎందుకీ యూనిఫామ్ అని ప్రశ్నిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు కూడా యూనిఫామ్ ఇవ్వాలని, లేదా తమకు రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి అధికారికంగా వీరు బయట పడకపోయినా.. సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ తరహా మెసేజ్ లు బాగా వైరల్ అవుతున్నాయి.
సచివాలయ ఉద్యోగులకు జీతాలు పెంచడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, మరి యూనిఫామ్ విషయంలో ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని, ఎందుకు డెడ్ లైన్లు పెడుతున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రొబేషన్ పూర్తయ్యాక యూనిఫామ్ వేసుకుంటామని చెబుతున్నారట. మరి దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాల్లో సచివాలయం అనేది చాలా మంచి కాన్సెప్ట్ అనే పేరుంది. సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున జరిగే పనుల్లో వేగం పెరిగిందని, పాలన ప్రజలకు మరింత దగ్గరైందని అంటారు. అదే సమయంలో ఏపీలోని నిరుద్యోగ సమస్యకు ఓ పరిష్కారం లభించిందని కూడా చెబుతుంటారు. ఈ దశలో సచివాలయాల ఉద్యోగులు ఓసారి జీతాలకోసం నల్లబ్యాడ్జీలతో రోడ్లెక్కారు. ఇప్పుడు మరోసారి యూనిఫామ్ విషయంలో మరోసారి గొడవ మొదలు పెడుతున్నారు. ప్రస్తుతానికి సచివాలయ సిబ్బంది యూనిఫామ్ విషయంలో ప్రభుత్వం మరీ అంత కఠినంగా లేదు. యూనిఫామ్ క్లాత్ ఇచ్చి, వాటిని కుట్టించుకోమన్నారు కానీ, యూనిఫామ్ లేకుండా వచ్చినవారిపై చర్యలు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల నిరసన వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: